దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో మాత్రమే ప్రభుత్వ భూముల సమస్యలు ఉన్నాయని హైకోర్టు వ్యాఖ్యానించింది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారంలోని భూముల వ్యవహారంపై మంగళవారం తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. సర్వే నెంబర్ 194, 195లలో 754 ఎకరాల భూమి ఉందని ప్రభుత్వ న్యాయవాది మురళీధర్ రెడ్డి కోర్టుకు తెలిపారు. అందులో కేవలం 95 ఎకరాలు మాత్రమే ప్రభుత్వ భూమి అని, మిగతాదంతా పట్టా భూమి అని ఆయన పేర్కొన్నారు.
2012 జూన్ వరకు ఈ భూమి పట్టా భూమిగానే ఉందని, పొరపాటున నిషేధిత జాబితాలో చేర్చారని, ఆ తర్వాత సరిదిద్దడంతో భూయజమానుల పేరు మీద పట్టాలు వచ్చాయని కోర్టుకు తెలిపారు. 95 ఎకరాల నిషేధిత భూమిలో మాత్రం ఎలాంటి లావాదేవీలు జరగడం లేదని కోర్టుకు విన్నవించారు.
ఏం జరిగింది?
నాగారంలో 700 ఎకరాల ప్రభుత్వ భూములున్నాయని, 2019 వరకు నిషేధిత జాబితాలో ఉన్నప్పటికీ 2018లోనే వాటికి పట్టాలు ఇచ్చారని మహేశ్వరం మండలం అమీర్‌పేటకు చెందిన మహేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై హైకోర్టు సోమవారం విచారణ చేపట్టింది.
నిషేధిత జాబితాలో ఉన్న భూములకు పట్టాలు ఎలా ఇచ్చారని రెవెన్యూ శాఖకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. పిటిషనర్లు లేవనెత్తిన అభ్యంతరాల్లో వాస్తవం లేదని, అవి పట్టా భూములేనని మంగళవారం జరిగిన విచారణ సందర్భంగా ప్రభుత్వ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా భూముల సమస్య ఇక్కడే ఉందని హైకోర్టు వ్యాఖ్యానించింది. అయితే అధికారులు చెబుతున్న వివరాలకు, వాస్తవాలకు పొంతనలేదని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. రెండేళ్ల వయస్సు ఉన్నవారి పేరు మీద పట్టా భూమి ఉందని, ఇందుకు సంబంధించిన వివరాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. దీంతో ప్రతివాదులకు హైకోర్టు నోటీసులు జారీ చేసి విచారణను వాయిదా వేసింది.