దక్షణాది చిత్ర పరిశ్రమల్లో ఇప్పటివరకు వచ్చిన ప్రేమ కథా చిత్రాల్లో ప్రేమదేశం సినిమా ఎప్పటికీ గుర్తుండిపోతుంది. కాలేజీ బ్యాక్ డ్రాప్ తో వచ్చిన ఆ సినిమా 90వ దశకంలో కుర్రకారును విశేషంగా ఆకట్టుకుంది. అబ్బాస్, వినీత్, టబుల నటన, అప్పటికి ఫ్రెష్ గా ఉన్న కథ, ఏఆర్ రెహమాన్ సంగీతం సినిమాను బ్లాక్ బస్టర్ చేశాయి. ఈ సినిమా అబ్బాస్ కు తొలి చిత్రం. ఈ సినిమా తర్వాత అబ్బాస్ అనేక తమిళ, తెలుగు చిత్రాల్లో నటించాడు. కానీ ప్రేమదేశంతో వచ్చిన స్టార్ డమ్ క్రమంగా కనుమరుగైంది. అబ్బాస్ ఓ సాధారణ నటుడిలా మిగిలాడు.
హీరో పాత్రల నుంచి సహాయనటుడి పాత్రలకు పడిపోయిన అబ్బాస్… కొంతకాలం కిందటివరకు హార్పిక్ యాడ్ లో దర్శనమిచ్చాడు. ఆ తర్వాత అది కూడా లేదు. ఇప్పుడు అబ్బాస్ భారత్ లో లేడు. తన కుటుంబంతో కలిసి ఎప్పుడో న్యూజిలాండ్ వెళ్లిపోయాడు. ప్రస్తుతం ఆక్లాండ్ లో నివసిస్తున్నాడు.
అలా ఎందుకు చేయాల్సి వచ్చిందని మీడియా ప్రశ్నిస్తే… న్యూజిలాండ్ వంటి దేశాలతో పోల్చితే భారత్ లో స్వేచ్ఛగా ఉండలేనని తెలిపాడు. న్యూజిలాండ్ వచ్చాక ఉపాధి కోసం ఓ పెట్రోల్ బంకులో పనిచేశానని, మోటార్ సైకిల్ మెకానిక్ గానూ, భవన నిర్మాణ రంగంలో కార్మికుడిగానూ పనిచేశానని తెలిపాడు. భారతదేశంలో తనను సినిమా నటుడిగానే చూస్తారు తప్ప, పని చేసుకుని బతకడానికి తగిన అవకాశాలు ఇవ్వరని వివరించాడు.
భారత్ లో అయితే, ఏ పని చేస్తే ఏమనుకుంటారో అన్న భావన చుట్టుముట్టేదని తెలిపాడు. న్యూజిలాండ్ లో ఆ సమస్య లేదని, తానెవరో వారికి తెలియదని, తాను ఏ పని చేసుకున్నా ఇబ్బంది ఉండేది కాదని అన్నాడు
న్యూజిలాండ్ లో కొన్నాళ్లు పని చేశాక, ఆస్ట్రేలియా వెళ్లి పబ్లిక్ స్పీకింగ్ కోర్సులో సర్టిఫికెట్ పొందానని, వ్యక్తిత్వ వికాసం అంశంపై యువతకు, అవసరమైనవారికి స్పీచ్ లు ఇస్తుంటానని అబ్బాస్ వెల్లడించాడు. ఆత్మహత్య ఆలోచనలు ఉన్నవారిని ఆ సంక్షోభం నుంచి బయటికి తీసుకురావడానికి తనవంతు కృషి చేస్తుంటానని తెలిపాడు. గతంలో తాను కూడా ఆత్మహత్య ఆలోచనలు చేశానని, కానీ అందులోంచి బయటపడి జీవితాన్ని మార్చేసుకున్నానని పేర్కొన్నాడు.