హైదరాబాద్: నగరంలోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పెద్ద మొత్తంలో మాదకద్రవ్యాలను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గత నెల 26న టాంజానియా దేశస్థుడు జోహనెస్‌బర్గ్ నుంచి శంషాబాద్ వచ్చాడు. అతడి కదలికలు అనుమానాస్పదంగా ఉండటంతో కస్టమ్స్ ఇంటెలిజెన్స్ అధికారులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. లగేజీని తనిఖీ చేసిన అధికారులు.. అతని వద్ద ఎలాంటి మాదకద్రవ్యాలు లేనట్లు తేల్చారు. కానీ అతని నడవడిలో తేడా గమనించి తమదైన శైలిలో విచారణ చేయగా.. హెరాయిన్ మాత్రలను మింగినట్లు తెలిపాడు. దీంతో అతడిని వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు.ఆరు రోజుల అనంతరం ప్రయాణికుడి నుంచి టేప్ చుట్టిన మాత్రలను కడుపు నుంచి బయటికి తీశారు. మొత్తం 108 మాత్రలను వెలికితీసిన అధికారులు.. వాటి బరువు 1,389గ్రాములు ఉన్నట్లు గుర్తించారు. అంతర్జాతీయ మార్కెట్లో దీని విలువ రూ.11.53 కోట్లు ఉంటుందని కస్టమ్స్ అధికారులు తెలిపారు. ఈ మేరకు ఆ ప్రయాణికుడిపై ఎన్‌డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. నిందితుడిని జ్యుడిషియల్ రిమాండ్‌కు తరలించినట్లు అధికారులు తెలిపారు. మరోవైపు ఇటీవల టాంజానియాకే చెందిన ఓ వ్యక్తి పొట్ట నుంచి 57 మాత్రలు వెలికితీసిన విషయం తెలిసిందే.