- దేశంలో నాలుగవ స్థానం
- చెన్నారెడ్డిని ఈ జైలులో పెట్టారు
- చంద్రబాబు రాకతో చర్చనీయాంశం
సాంస్కృతిక రాజధాని రాజమహేంద్రవరంలో గల సెంట్రల్ జైలు ఇప్పుడు వార్తల కెక్కింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ జైలు చర్చనీయాశమైంది. ఇందుకు కారణం మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడును స్కిల్ కేసులో అరెస్టు చేసి ఈ జైలుకు తరలించడమే. అసలు ఈ జైలుకు ఇంత ప్రాధాన్యత సంతరించుకోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. సువిశాలమైన విస్తీర్ణంలో కట్టుదిట్టమైన భద్రత కలిగిన ఈ సెంటర్ జైలు దేశంలోనే నాలుగో స్థానం లో ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో గల తీహార్ జైలు మొదటి స్థానంలో ఉంది.
స్వాతంత్ర సమరం జరుగుతున్న సమయంలో ఆజాద్ చంద్రశేఖర్ వంటి మహోన్నత వ్యక్తులను బంధించిన అపకీర్తితోపాటు వందల మంది సమరయోధుల ఉసురు తీసిన చరిత్ర ఈ జైలుకే సొంతం. తెలుగు రాష్ట్రాల్లో ఉరిశిక్ష అమలు పరిచే ఏకైక అతిపెద్ద మృత్యు కారాగరంగా ఈ సెంటర్ జైలును పేర్కోవచ్చు.
శతాబ్దాల చరిత్ర…
రాజమండ్రి సెంట్రల్ జైలుకు శతాబ్దాల చరిత్ర ఉంది. పూర్వకాలంలో డచ్చి వారు వ్యాపార నిమిత్తం కోట నిర్మించుకున్నారని బ్రిటిష్ వారు దీనిని జైలుగా మార్చారని చెబుతారు. అయితే ఇది జైలుగా ఎప్పుడు ఏర్పాటైంది అనేది స్పష్టమైన ఆధారాలు లేవు. కొందరు 17వ శతాబ్దంలో ఏర్పాటయిందని మరికొందరు 18వ శతాబ్దంలో ఏర్పడిందని పేర్కొంటారు. కాని 1864 సంవత్సరం లో జిల్లా జైలుగా ఉంటూ 1890 లో సెంటర్ జైలు గా గుర్తింపు పొందిందనే ఆధారాలు ఉన్నాయి. 212 ఎకరాల విస్తీర్ణంలో ఈ జైలు ఉండగా అందులో 39.0 2 ఎకరాల్లో జైలు కట్టడాలు ఉన్నాయి. అత్యంత కట్టుదిట్టమైన భద్రతతో ఈ జైలును నిర్మించారు.2015 సంవత్సరంలో కోట్లాది రూపాయల వ్యయంతో ఈ జైలును ఆధునీకరించారు.ఈ జైలులో సుమారు మూడు వేల మంది ఉండేందుకు సౌకర్యాలు ఉన్నాయి. ప్రస్తుతం 2045 మంది ఉన్నారు. అలాగే జైలు ఉద్యోగులు మరో రెండు వందల మంది ఉన్నారు.
అయితే రాజమహేంద్రవరం నడిబొడ్డున ఉన్న ఈ జైలు ను వేరే ప్రాంతానికి తరించే ప్రయత్నాలు చాలా జరిగినా కార్యరూపం దాల్చలేదు. ఈ జైలును జగ్గంపేట ప్రాతానికి తరలించి ఇక్కడ అందరికీ అందుబాటులో ఉండే విధంగా నన్నయ్య యూనివర్సిటీ ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలు జరిగాయి. ఇటీవల మెడికల్ కళాశాల ఏర్పాటు చేయడానికి ప్రతిపాదించారు.కాని కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు రావడం లేదు.
ఈ జైలులో 42 మందికి ఉరి
మనకు స్వతంత్రం వచ్చినప్పుడు నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 450 మందికి వివిధ నేరాల్లో న్యాయస్థానాలు మరణశిక్ష విధించాయి. అయితే అప్పీలు చేసుకోవడంతోనూ, రాష్ట్రపతి క్షమాభిక్ష ద్వారాను 366 మందికి ఉరిశిక్ష రద్దు చేసి యావజ్జీవ శిక్షలు ఖరారు చేసారు. మిగిలిన 92 మందిని ఉరితీసారు. అప్పట్లో రాజమండ్రి జైలుతో పాటు విశాఖ, ముషీరాబాద్ జైల్లో కూడా ఉరి సదుపాయం ఉండేది. దీంతో విశాఖపట్నం జైల్లో 13 మందిని, ముషీరాబాద్ జైల్లో 32 మందిని, రాజమహేంద్రవరం జైల్లో 47 మందిని ఉరితీశారు. తర్వాత పరిణామాల్లో ముషీరాబాద్, విశాఖలలో ఉరి అమలు చేసే సదుపాయాన్ని రద్దు చేయడంతో రాజమహేంద్రవరం ఏకైక ఊరికంబంగా ఉండేది.ఈ జైలులో ఒకే సారి ఇద్దరని ఉరి తీసే సదుపాయం ఉంది. రాజమహేంద్రవరం జైలులో ఉరి తీసిన వివరాల్లోకెళ్తే 1948లో ఐదుగురిని, 1949లో ఇద్దరినీ, 1956లో ముగ్గురిని, 1957లో ఒకరిని, 1959 లో ఎనిమిది మందిని, 1961లో ఇద్దరినీ,1962లో నలుగురిని,1963 లో ఏడుగురిని, 1964లో ఐదుగురిని, 1967లో ముగ్గురిని, 1958లో ఒకరిని, 1971లో ముగ్గురిని, 1972లో ఒకరిని, 1974లో ఒకరిని ఉరితీసారు. చివరగా 1976లో నంది కిష్టప్పను ఉరి తీశారు. ఆ తర్వాత ఈ సెంటర్ జైలులో ఊరికంబానికి వేలాడిన నేరస్థుడు ఎవరూ లేరు.
రెండు గంటల ముందు ఇద్దరకి ఉరి ఆగింది
రాజమండ్రి జైలులో ఇద్దరికి ఉరి తీయడానికి అన్ని ఏర్పాట్లు జరిగాయి. మరో రెండు గంటలలో వారికి ఉరి తీయాల్సి ఉంది. ఇంతలో రాష్టపతి క్షమాభిక్ష ఉత్తర్వులు వచ్చిన సంఘటన చాలా మందికి గుర్తుండే ఉంటుంది. 1993 మార్చి 8న చిలకలూరిపేట బస్సు దహనం కేసులో సుమారు 35 మంది సజీవ దహనం అయ్యారు. ఆ బస్సు దహనం హంతకులుగా సాతులూరి చలపతిరావు, గంటల విజయవర్ధన్ రావులకు ఉరిశిక్ష ఖరారైంది. 1995 నవంబర్ 6న వారిద్దరికి ఉరి తీయడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. చివరి నిమిషాల్లో రాష్ట్రపతి కె.ఆర్ నారాయణ క్షమాభిక్ష పెట్టిన ఉత్తర్వులు రావడంతో వారిద్దరూ ప్రాణాలు నిలిచాయి. అప్పుడు కూడా అనేకమంది జర్నలిస్టులు, కెమెరామెన్లు(ఫిల్మ్ లు లోడ్ చేసుకుని) జైలు ముందు టెన్షన్ గా ఎదురు చూశారు.
జైలులో ఎన్నో ఉపాధి అవకాశాలు
సువిశాలమైన ఈ కేంద్ర కారాగారంలో ఎన్నో ఉపాధి అవకాశాలు జైలు శాఖ కల్పిస్తుంది. శిక్షను అనుభవిస్తున్న ఖైదీలకు వారికున్న అనుభవం మేరకు వివిధ పనులను అప్పగిస్తారు. పండ్లతోటలు పెంపకంతో పాటు ఫర్నిచర్, దుస్తులు తయారీ వంటి పనులు అప్పగిస్తారు.పలు చేతివృత్తులకు సంబంధించిన శిక్షణ ఇస్తారు. అలాగే మానసిక ఉల్లాసానికి పలు రకాల క్రీడలు, యోగ వంటివి ఖైదీలకు అలవరిస్తారు. అంతే కాదు ఈ జైలు ద్వారానే చదువుకునే అవకాశం కూడా కల్పిస్తారు. ఈ జైలు నుండి శిక్షా కాలంలోనే వందలాది మంది డిగ్రీ పూర్తి చేశారంటే ఎవరికైనా ఆశ్చర్యం కలగక మానదు.
నాడు చెన్నారెడ్డి నేడు చంద్రబాబు నాయుడు
రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు రిమాండ్ కు వెళ్లిన వారిలో అత్యంత ముఖ్యమైన వారిగా ప్రస్తుతం రిమాండులో ఉన్న మాజీ ముఖ్యమంత్రి,టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడును పేర్కోవచ్చు. స్కిల్ కేసులో ఆయనను ఈనెల 16న అరెస్టు చేసి 17న రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వంటి ప్రముఖులు ఈ జైలుకు వచ్చారు. అయితే 1970వ దశకంలో మర్రి చెన్నారెడ్డి కూడా ఈ సెంట్రల్ జైలులో ఉన్నారు. అప్పుడు తెలంగాణ ఉద్యమ సందర్భంగా యువకుడైన చెన్నారెడ్డిని అరెస్ట్ చేసి ఈ జైలుకు తరలించారు. ఆ తర్వాత రోజుల్లో ఆయన మూడుసార్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగాను,రాజస్థాన్ రాష్ట్ర గవర్నర్ పదవులను చేపట్టిన సంగతి తెలిసిందే.పుష్కరాలు సందర్భంగా వచ్చే భక్తులకు ఈ జైలును సందర్శించే అవకాశం ఇచ్చేవారు. అందువల్ల చాలా ఎలాంటి నేరాలు చేయకపోయినా ఈ జైలుకు వెళ్లి వచ్చారు.