- ఆదివారం వస్తే చాలు అక్రమ నిర్మాణాలు
- అధికారులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకోని వైనం
- పోరుబాటకు సిద్ధమవుతున్న గిరిజనులు
అల్లూరి జిల్లా, హుకుంపేట: జిల్లా ఏజెన్సీ ఏరియాలో గిరిజనేతరులు అక్రమంగా ఇళ్లు, దుకాణాల నిర్మాణాలు యధేచ్ఛగా చేపడుతున్నారు. అక్రమ కట్టడాల విషయంలో విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని స్వయంగా గిరిజనులే జిల్లాస్థాయి అధికారులకు ఫిర్యాదులు చేసినా పట్టించున్న నాథుడు లేడు. ఫలితంగా 1/70 చట్టాన్ని అమలుపర్చాలని కోరుతూ గిరిజనులు పోరుబాట పట్టేందుకు సన్నద్ధమవుతున్నారు.
ఈ దందా యధేచ్ఛగా కొనసాగుతోంది. తొలుత ఏజెన్సీ ఏరియాలో ఆక్ర మణలు చేపట్టడం ఆ తర్వాత కట్టడాలు ప్రారంభించడం పరిపాటిగా మారింది. ఈ విషయంలో స్వయంగా అధికారులకు పలుమార్లు గిరిజన నంఘాల నాయకులు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అయినా అధికారులు పట్టించుకోలేదు.
అధికారులు వ్యవహరించే తీరు విభిన్నంగా ఉంది. ఏజెన్సీలో ఉన్న గిరిజనుల భూములు ఎవరూ కొనరాదు, అమ్మరాదు అన్న స్పష్టమైన నిబంధన ఉన్నప్పటికీ ఆక్రమించి యదేచ్ఛగా ఇల్లు, దుకాణాల నిర్మాణాలు చేపడుతున్నారు. అదే గిరిజనుల భూములను గిరిజనులు కొనుగోలు చేస్తే అధికారులు నోటీసులు జారీ చేస్తున్నారు. నిర్మాణాలు కూలగొడుతున్నారు. పొట్టకూటి కోసం బ్రతుకుతెరువు కోసం చిన్నపాటి షెడ్లు కానీ గుడిసెలు నిర్మించుకుంటే కూల్చేస్తారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఏజెన్సీ ప్రాంతంలో 1/ 70 భూ బదలాయింపు చట్టం పూర్తిగా నిర్వీర్యం అవుతుంది. ఈ విషయంలో వెంటనే సమగ్ర విచారణ జరిపితే ఈ దందాకు పాల్పడుతున్నదెవరు..? ఎవరు అండదండలు అందిస్తున్నారనే విషయం ఇట్టే వెలుగుచూస్తాయి.
తక్షణమే జిల్లా కలెక్టర్ స్పందించి హుకుంపేట మండల కేంద్రంలో గిరిజనేతరుడు “దొడ్డి ప్రసాద్”నిర్మిస్తున్న శాశ్వత అంతస్తుల గృహ నిర్మాణాలను వెంటనే తొలగించాలని స్థానిక గిరిజన సంఘాలు కోరుతున్నాయి.










