contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

హైదరాబాద్‌లో అక్రమ సరోగసీ రాకెట్… లేడీ డాక్టర్ ను అరెస్ట్ చేసిన ఈడీ

హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన అక్రమ సరోగసీ రాకెట్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కీలక చర్యలు చేపట్టింది. మనీలాండరింగ్ ఆరోపణలపై డాక్టర్ అడుతూరు నమ్రత అలియాస్ పచ్చిపల్లి నమ్రతను శుక్రవారం అరెస్ట్ చేసింది. అనంతరం ఆమెను కోర్టులో హాజరుపరచగా, ఫిబ్రవరి 26 వరకు జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు.

యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ అండ్ రీసెర్చ్ సెంటర్ పేరుతో నమ్రత ఈ అక్రమ దందా నడిపినట్లు ఈడీ దర్యాప్తులో తేలింది. సంతానం లేని దంపతుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసి, వారికి సరోగసీ ద్వారా బిడ్డను అందిస్తామని నమ్మించేవారని అధికారులు పేర్కొన్నారు. అయితే, పేదరికంతో బిడ్డలను పెంచుకోలేని గర్భిణులను ఏజెంట్ల ద్వారా గుర్తించి, పుట్టిన వెంటనే శిశువులను కొనుగోలు చేసినట్లు ఈడీ ఆరోపించింది.

దర్యాప్తులో వెల్లడైన వివరాల ప్రకారం, ఆడశిశువుకు రూ. 3.5 లక్షలు, మగశిశువుకు రూ. 4.5 లక్షలు చెల్లించి, అనంతరం సంతానం లేని దంపతులకు విక్రయించేవారని తెలిసింది.

ఈ రాకెట్‌పై గతంలోనే హైదరాబాద్ గోపాలపురం పోలీస్ స్టేషన్‌లో చీటింగ్, చైల్డ్ ట్రాఫికింగ్ కేసులపై పలు ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. 2025 నవంబర్‌లో బెయిల్‌పై విడుదలైన నమ్రత, మనీలాండరింగ్ కోణంలో దర్యాప్తు చేపట్టిన ఈడీ విచారణకు సహకరించకపోవడంతో తాజాగా పీఎంఎల్‌ఏ చట్టం కింద అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు.

సికింద్రాబాద్‌లోని ఆసుపత్రి లైసెన్సును రద్దు చేయగా, విశాఖపట్నం కేంద్రంగా ఈ అక్రమ కార్యకలాపాలను కొనసాగించినట్లు ఈడీ గుర్తించింది. దంపతులనే అసలు తల్లిదండ్రులుగా చూపిస్తూ నకిలీ జనన ధృవపత్రాలు సృష్టించినట్లు కూడా వెల్లడైంది.

ఈ రాకెట్‌లో ఏజెంట్లు, సబ్-ఏజెంట్ల నెట్‌వర్క్ కీలక పాత్ర పోషించినట్లు ఈడీ తెలిపింది. కేసుకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం దర్యాప్తు కొనసాగుతోంది.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :