హైదరాబాద్: నగరంలోని ఎల్బీనగర్ పరిధిలో భారీ పేలుడు సంభవించింది. ఆర్కేపురంలో ఉన్న చట్నీస్ హోటల్లో మధ్యాహ్నం ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలుడు చోటుచేసుకోవడంతో హోటల్ సిబ్బంది, కస్టమర్లు భయంతో బయటకు పరుగులు తీశారు.
పోలీసుల ప్రాథమిక విచారణలో అధిక వేడి కారణంగా ఇడ్లీ స్టీమర్ పేలిపోయినట్లు గుర్తించారు. ఈ ఘటనలో ముగ్గురు హోటల్ సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. హైడ్రా సిబ్బంది, బాంబు స్క్వాడ్ బృందాలు హోటల్ కిచెన్‌ను సమగ్రంగా పరిశీలించాయి. పేలుడుకు గల ఖచ్చితమైన కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది.
ఈ ఘటనతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. హోటల్ పరిసర ప్రాంతంలో కొంతసేపు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అధికారులు భద్రతా ప్రమాణాలను పాటించాలని హోటల్ యజమానులకు సూచించారు.








