హైదరాబాద్ నగరంలో అగ్నిమాపక భద్రతా నిబంధనల ఉల్లంఘనలపై హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) కఠిన చర్యలకు దిగింది. ఇటీవల నాంపల్లిలో చోటుచేసుకున్న ఘోర అగ్నిప్రమాదం నేపథ్యంలో అధికారులు తనిఖీలను ముమ్మరం చేశారు. ఈ క్రమంలో గురువారం జూబ్లీహిల్స్‌లోని ప్రముఖ వస్త్ర దుకాణం ‘నీరూస్’తో పాటు నాంపల్లిలోని ఓ ఫర్నిచర్ షోరూంను హైడ్రా అధికారులు సీజ్ చేశారు.
హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ నేతృత్వంలో హైడ్రా, జీహెచ్ఎంసీ, అగ్నిమాపక, విద్యుత్ శాఖల అధికారులు సంయుక్తంగా ఈ తనిఖీలు నిర్వహించారు. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 36లోని నీరూస్ షోరూంలో తనిఖీ చేపట్టిన అధికారులు తీవ్ర ఉల్లంఘనలను గుర్తించారు. మూడు సెల్లార్లు, నాలుగు అంతస్తులతో పాటు అనుమతి లేకుండా నిర్మించిన రూఫ్ షెడ్‌లో కూడా భారీగా వస్త్రాలను నిల్వ ఉంచినట్లు తేలింది.
ఫైర్ సేఫ్టీ ఎన్‌ఓసీ లేకపోవడం, మంటలను ఆర్పే పరికరాలు సరైన స్థితిలో లేకపోవడంపై కమిషనర్ ఏవీ రంగనాథ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భవనం పై అంతస్తులను గోదాములుగా, వస్త్రాల తయారీ కేంద్రాలుగా మార్చడంపై తీవ్ర అభ్యంతరం తెలిపారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని వ్యాఖ్యానించిన ఆయన, వెంటనే షోరూంను సీజ్ చేయాలని ఆదేశించారు.
అనంతరం అధికారులు నాంపల్లి స్టేషన్ రోడ్డులోని రహీమ్, మన్నన్ ఎస్టేట్స్‌లో ఉన్న స్టాండర్డ్ ఫర్నిచర్ షోరూంను తనిఖీ చేశారు. ఇటీవల ఐదుగురు మృతి చెందిన అగ్నిప్రమాదం జరిగిన రోడ్డులోనే ఈ షోరూం ఉండటం గమనార్హం. అయినప్పటికీ ఇక్కడ ఎలాంటి అగ్నిమాపక భద్రతా చర్యలు తీసుకోకపోవడాన్ని కమిషనర్ తీవ్రంగా పరిగణించారు.
ఆరు అంతస్తుల భవనంలో మెట్ల మార్గాన్ని కూడా మూసివేసి ఫర్నిచర్ నిల్వ ఉంచడం, కనీసంగా ఫైర్ ఎక్స్‌టింగ్విషర్లు కూడా లేకపోవడంతో ఈ షోరూంను కూడా సీజ్ చేయాలని ఆదేశించారు. రెండు షోరూంల వద్ద ‘ఫైర్ అన్ సేఫ్’ బోర్డులు ఏర్పాటు చేసి, హైడ్రా ఫెన్సింగ్ వేశారు. విద్యుత్ శాఖ అధికారులు వెంటనే విద్యుత్ సరఫరాను నిలిపివేశారు.
నగరంలో ఎక్కడైనా అగ్నిమాపక భద్రతా నిబంధనల ఉల్లంఘనలు కనిపిస్తే తమ దృష్టికి తీసుకురావాలని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ప్రజలను కోరారు. హైడ్రా కంట్రోల్ రూమ్ నంబర్ 9000113667 లేదా వాట్సాప్ నంబర్ 7207923085కు ఫొటోలు, వీడియోలతో సహా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు.









