మాదాపూర్ : సున్నం చెరువు పూర్తిస్థాయి నీటిమట్టం (ఎఫ్టీఎల్) సరిహద్దుల్లో ఎలాంటి మార్పులు చేయడం లేదని హైడ్రా స్పష్టం చేసింది. చెరువు ఎఫ్టీఎల్ హద్దులను మార్చి అభివృద్ధి పనులు చేపడుతున్నారంటూ మాధవరం కృష్ణారావు చేసిన ఆరోపణలను సంస్థ తీవ్రంగా ఖండించింది.
ఒక ప్రకటనలో హైడ్రా పేర్కొంటూ, చెరువు అభివృద్ధి పనులను అత్యంత శాస్త్రీయంగా, పారదర్శకంగా నిర్వహిస్తున్నామని తెలిపింది. ఇందులో ఎవరికీ అనుమానాలకు తావులేదని స్పష్టం చేసింది.
2014లోనే ఎఫ్టీఎల్ నిర్ధారణ
సున్నం చెరువు ఎఫ్టీఎల్ను 2014 మే నెలలోనే నిర్ధారించారని హైడ్రా వెల్లడించింది. అప్పట్లో ఇరిగేషన్ శాఖ నిర్ణయించిన సరిహద్దుల మేరకే ప్రస్తుతం అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని వివరించింది. ఇరిగేషన్, రెవెన్యూ తదితర సంబంధిత శాఖల సమన్వయంతో ఎఫ్టీఎల్ నిర్ధారణ ప్రక్రియ అత్యంత పారదర్శకంగా జరిగిందని పేర్కొంది.
ఒకప్పుడు ఆక్రమణల కారణంగా కేవలం 14 ఎకరాలకు కుదించుకుపోయిన చెరువును, 2014లో ఇరిగేషన్ శాఖ నిర్ధారణ ప్రకారం 31 ఎకరాలకు విస్తరించిన విషయాన్ని గుర్తుచేసింది. ఈ ప్రక్రియలో పేదలకు అన్యాయం చేయడం గానీ, పెద్దలను కాపాడడం గానీ జరగలేదని తేల్చిచెప్పింది.
ఎమ్మెల్యేకు అధికారులు వివరాలు
సోమవారం చెరువును సందర్శించిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుకు అక్కడే ఉన్న ఇరిగేషన్ అధికారులు వాస్తవ పరిస్థితులను వివరించారని హైడ్రా తెలిపింది. 2014లో నిర్ణయించిన జియో కో-ఆర్డినేట్స్ (అక్షాంశాలు, రేఖాంశాలు) ప్రకారమే ఎఫ్టీఎల్ సరిహద్దులను గుర్తించి పనులు చేపడుతున్నామని స్పష్టం చేసింది.
చెరువు ఎఫ్టీఎల్ సరిహద్దులు శాశ్వతమైనవని, వాటిని మార్చే ప్రసక్తే లేదని హైడ్రా పునరుద్ఘాటించింది. ఈ విషయంలో అనవసర అపోహలు సృష్టించవద్దని కోరుతూ, చెరువు అభివృద్ధి కార్యక్రమాలకు అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేసింది.








