బంగ్లాదేశ్‌లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, భద్రతా పరమైన ఆందోళనల నేపథ్యంలో అక్కడ విధుల్లో ఉన్న భారత దౌత్యవేత్తలు సహా ఇతర అధికారుల కుటుంబ సభ్యులను భారత్‌కు తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. పరిస్థితులపై సమీక్ష చేసిన అనంతరం ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
ఢాకాలోని భారత హై కమిషన్‌తో పాటు బంగ్లాదేశ్‌లోని ఇతర ప్రాంతాల్లో పనిచేస్తున్న అధికారులు తమ కుటుంబ సభ్యులను భారత్‌కు తిరిగి పంపించాలని విదేశాంగశాఖ సూచించినట్లు తెలిసింది. ప్రస్తుతం ఇది ఒక జాగ్రత్త చర్యగా చేపట్టిన నిర్ణయంగా అధికారులు పేర్కొంటున్నారు.
అయితే కుటుంబ సభ్యులను భారత్‌కు ఎప్పుడు తరలిస్తారన్న విషయంపై ఇప్పటివరకు స్పష్టత రాలేదు. పరిస్థితులను బట్టి తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
ప్రస్తుతం బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో భారత హై కమిషన్ కార్యాలయం ఉండగా, అదనంగా నాలుగు ప్రాంతాల్లో అసిస్టెంట్ హై కమిషన్ కార్యాలయాలు కొనసాగుతున్నాయి. అక్కడ పనిచేస్తున్న అధికారుల భద్రతపై కేంద్రం ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది.










