అమృత్‌సర్ : పంజాబ్ పోలీసులకు చెందిన స్టేట్ స్పెషల్ ఆపరేషన్స్ సెల్ (ఎస్‌ఎస్‌ఓసీ) భారీ ఉగ్ర కుట్రను భగ్నం చేసింది. పంజాబ్, దిల్లీ సహా పలు రాష్ట్రాల్లో ఉగ్రదాడులకు ప్రణాళిక రచించిన పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదిని అరెస్టు చేసినట్లు పంజాబ్ డీజీపీ గౌరవ్ యాదవ్ వెల్లడించారు. నిందితుడి వద్ద నుంచి రిమోట్ కంట్రోల్‌తో ఆపరేట్ చేసే ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైజ్ (ఐఈడీ), విదేశీ తయారీ పిస్టల్, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
నిఘా వర్గాల నుంచి అందిన పక్కా సమాచారంతో అమృత్‌సర్ కేంద్రంగా పనిచేస్తున్న స్పెషల్ ఆపరేషన్స్ విభాగం పకడ్బందీగా ఆపరేషన్ నిర్వహించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు డీజీపీ గౌరవ్ యాదవ్ ఎక్స్ వేదికగా వెల్లడించారు.
పాక్ ఉగ్రవాది సహకారంతో దాడుల ప్రణాళిక
దర్యాప్తులో భాగంగా పాకిస్థాన్‌కు చెందిన ఓ ఉగ్రవాది సహకారంతో నిందితుడు భారత్‌లో ఉగ్రదాడులకు ప్రణాళిక రచించినట్లు గుర్తించినట్లు డీజీపీ తెలిపారు. ఎన్‌క్రిప్టెడ్ మెసేజింగ్ యాప్‌ల ద్వారా పాక్ ఉగ్రవాదితో నిత్యం సంప్రదింపులు జరిపినట్లు వెల్లడించారు. ఉగ్రదాడులకు అవసరమైన పేలుడు సామగ్రిని పాక్ సరిహద్దు మార్గంగా భారత్‌లోకి అక్రమంగా చేర్చినట్లు పేర్కొన్నారు.
అమృత్‌సర్ నగర శివారులోని కిర్టోవాల్ ఆటో కేర్ సమీపంలో ఈ సామగ్రిని నిందితుడికి అందజేసినట్లు సమాచారం. పంజాబ్, దిల్లీ సహా పలు రాష్ట్రాల్లో ఉగ్రదాడులకు ఈ ఐఈడీ, పిస్టల్, మందుగుండు సామగ్రిని వినియోగించాలని యత్నించినట్లు డీజీపీ తెలిపారు. ఈ ఘటనపై అమృత్‌సర్ ఎస్‌ఎస్‌ఓసీ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, నిందితుడిని లోతుగా విచారిస్తున్నట్లు చెప్పారు. ఉగ్ర నెట్‌వర్క్‌లోని మిగతా సభ్యులను గుర్తించే దిశగా ముమ్మర దర్యాప్తు కొనసాగుతోంది.
పాక్ నుంచి ఆయుధాల స్మగ్లింగ్ – ఇద్దరు అరెస్ట్
ఇటీవల పాకిస్థాన్ సరిహద్దు నుంచి భారత్‌లోకి అక్రమంగా ఆయుధాలు తరలిస్తున్న ఇద్దరిని కూడా పంజాబ్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి గ్లోక్ 9ఎంఎం, పాయింట్ 30 బోర్ పిస్టల్స్ స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆయుధాలు అత్యంత ప్రమాదకరమని డీజీపీ పేర్కొన్నారు.
ఈ ఇద్దరు నిందితులు సోషల్ మీడియా ద్వారా పాకిస్థాన్‌కు చెందిన ఆయుధ స్మగ్లర్లతో సంప్రదింపులు జరిపినట్లు దర్యాప్తులో తేలింది. ఆయుధాల ధర చెల్లింపు నుంచి సరిహద్దు మార్గంగా భారత్‌లోకి చేరవేత వరకు అన్ని విషయాలు ఆన్‌లైన్‌లో చర్చించినట్లు వెల్లడించారు. వీరిపై అమృత్‌సర్ హకీమా గేట్ పోలీస్ స్టేషన్‌లో ఆర్మ్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు.
డబ్బు ఎరగా వేసి స్మగ్లింగ్
తాజాగా అరెస్టయిన ఇద్దరిలో ఒకరు అమృత్‌సర్‌లోని ఓ సెలూన్‌లో అసిస్టెంట్‌గా పనిచేస్తున్న వ్యక్తి అని ఎస్‌ఎస్‌ఓసీ ఏఐజీ సుఖ్మీందర్ సింగ్ మాన్ తెలిపారు. 2022లో అమృత్‌సర్‌కు వచ్చిన ఓ విదేశీయుడితో పరిచయం ఏర్పడిన తర్వాత అతనితో నిందితుడు నిరంతరం టచ్‌లో ఉన్నట్లు చెప్పారు. మొదట్లో కొంత మొత్తాన్ని బ్యాంకు ఖాతాలో జమ చేసి, అనంతరం ఆయుధాల స్మగ్లింగ్ బాధ్యతలు అప్పగించినట్లు వెల్లడించారు.
అక్రమ ఆయుధాల సరఫరా, ఉగ్ర నెట్‌వర్క్‌లను పూర్తిగా ఛేదించేందుకు ఎలాంటి రాజీ పడబోమని పంజాబ్ డీజీపీ గౌరవ్ యాదవ్ స్పష్టం చేశారు. దేశ భద్రతకు ముప్పుగా ఉన్న ఈ కుట్రలపై దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు.








