contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

సుఖోయ్ యుద్ధ విమానం ప్రమాదం… ఆపరేషన్ సిందూర్‌లో పాల్గొన్న పైలట్ మృతి

భారత వైమానిక దళానికి చెందిన సుఖోయ్ యుద్ధ విమానం ప్రమాదంలో ఇద్దరు పైలట్లు మృతి చెందారు. మృతుల్లో ఫ్లైట్ లెఫ్టినెంట్ పూర్వేశ్ దురాగ్‌కర్ (28) కూడా ఉండటం విషాదాన్ని మరింత తీవ్రం చేసింది. ఆయన గతంలో దేశ భద్రత కోసం చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌లో పాల్గొన్నట్లు అధికారులు తెలిపారు.

పూర్వేశ్ దురాగ్‌కర్ మృతి వార్తతో మహారాష్ట్రలోని నాగపూర్‌లో వారి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన తండ్రి రవీంద్ర దురాగ్‌కర్ రిటైర్డ్ రైల్వే ఉద్యోగి. బుధవారం రోజే తన కుమారుడితో మాట్లాడామని, కానీ అనూహ్యంగా గ్రూప్ కెప్టెన్ నుంచి వచ్చిన ఫోన్ కాల్ ద్వారా ప్రమాదం విషయం తెలిసిందని ఆయన కంటతడిపెట్టారు.

దేశానికి సేవ చేయాలనే తపనతోనే తన కుమారుడు యుద్ధ విమానం పైలట్‌గా మారాడని, దేశ రక్షణ కోసం సేవలందించిన తన కుమారుడిపై తాను గర్వపడుతున్నానని రవీంద్ర దురాగ్‌కర్ భావోద్వేగంగా తెలిపారు.

గత సంవత్సరం పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌లో పూర్వేశ్ దురాగ్‌కర్ పాల్గొన్న విషయం తెలిసిందే. తన కుమారుడు మొదట అసోంలోని తేజ్‌పూర్‌లో విధుల్లో చేరాడని, అక్కడ రన్‌వే పనులు కొనసాగుతున్న కారణంగా తాత్కాలికంగా జోర్హాట్ వైమానిక స్థావరంలో విధులు నిర్వహిస్తున్న సమయంలోనే ఈ ప్రమాదం జరిగిందని ఆయన తండ్రి తెలిపారు.

యుద్ధ విమాన పైలట్‌గా తన అనుభవాలను తరచూ తనతో పంచుకునేవాడని ఆయన గుర్తుచేసుకున్నారు. “నా కుమారుడు భారత వైమానిక దళంలో భాగమైనందుకు నాకు ఎంతో గర్వంగా ఉంది” అని అన్నారు.

ఇటీవల పది రోజుల క్రితమే కుటుంబ సభ్యులంతా నాగపూర్‌లో కలుసుకున్నారని స్థానికులు తెలిపారు. ఆ సమయంలో అమెరికాలో నివసిస్తున్న పూర్వేశ్ సోదరి కూడా నాగపూర్‌కు వచ్చినట్లు చెప్పారు. నాగపూర్‌లోనే విద్యాభ్యాసం పూర్తిచేసుకున్న పూర్వేశ్‌కు ఇంకా వివాహం కాలేదు. ఆయన అకాల మరణం కుటుంబ సభ్యులతో పాటు స్థానికులను కూడా తీవ్ర విషాదంలో ముంచింది.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :