రష్యా నుంచి భారత్ ఇంధనం కొనుగోలు చేయడంపై పశ్చిమ దేశాల నుంచి వస్తున్న విమర్శలను భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ గట్టిగా కౌంటర్ ఇచ్చారు. రష్యా నుంచి అత్యధికంగా చమురు, గ్యాస్ కొనుగోలు చేస్తున్నది భారత్ కాదని, చైనా, యూరోపియన్ యూనియన్‌లే ఆ స్థానంలో ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. రష్యా పర్యటనలో ఉన్న ఆయన గురువారం ఒక మీడియా సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు.
“రష్యా నుంచి మేమేమీ అతిపెద్ద చమురు కొనుగోలుదారులం కాదు, ఆ స్థానంలో చైనా ఉంది. అలాగే, సహజ వాయువును అత్యధికంగా కొంటున్నది యూరోపియన్ యూనియన్. 2022 తర్వాత రష్యాతో వాణిజ్యాన్ని విపరీతంగా పెంచుకున్న దేశాల్లో కూడా మేము లేము” అని జైశంకర్ వివరించారు. ఈ విషయంలో భారత్‌ను లక్ష్యంగా చేసుకోవడం సరికాదని ఆయన పరోక్షంగా సూచించారు.
గతంలో అమెరికా వైఖరిని గుర్తుచేస్తూ జైశంకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “ప్రపంచ ఇంధన మార్కెట్‌ను స్థిరీకరించేందుకు అవసరమైతే రష్యా నుంచి కూడా చమురు కొనాలని గత కొన్నేళ్లుగా చెబుతూ వచ్చింది అమెరికాయే. వాళ్ల మాట ప్రకారమే మేం నడుచుకున్నాం. యాదృచ్ఛికంగా, మేం అమెరికా నుంచి కూడా చమురు కొనుగోలు చేస్తున్నాం, ఆ పరిమాణం కూడా పెరిగింది. అలాంటప్పుడు ఇప్పుడు ఈ విమర్శల వెనుక ఉన్న తర్కం ఏమిటో మాకు అర్థం కావడం లేదు” అని ఆయన అన్నారు.
ఉక్రెయిన్ సంక్షోభం విషయంలో రష్యాను నిలువరించేందుకే భారత ఉత్పత్తులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాలు విధించారని అమెరికా వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ మంగళవారం చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో జైశంకర్ ఈ విధంగా స్పందించడం ప్రాధాన్యం సంతరించుకుంది.