విజయవాడ : దసరా ఉత్సవాల వేళ విజయవాడలోని ఇంద్రకీలాద్రి భక్తజన సంద్రంగా మారింది. నేడు విజయదశమి సందర్భంగా కనకదుర్గమ్మను దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. భక్తుల రద్దీ బాగా పెరగడంతో అమ్మవారి దర్శనానికి సుమారు నాలుగు గంటల సమయం పడుతోంది. దర్శన క్యూలైన్లు కొండ కింద వరకు కిలోమీటర్ల మేర విస్తరించాయి.
సామాన్య భక్తులతో పాటు పెద్ద సంఖ్యలో భవానీలు కూడా దీక్షలు విరమించేందుకు ఇంద్రకీలాద్రికి చేరుకోవడంతో కొండ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. భక్తుల రద్దీని నియంత్రించేందుకు ఆలయ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. చరిత్రలో తొలిసారిగా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తరహాలో కంపార్ట్‌మెంట్ల విధానాన్ని ప్రవేశపెట్టారు. భక్తులను కంపార్ట్‌మెంట్లలోకి పంపి, అక్కడ నుంచి విడతల వారీగా దర్శనానికి అనుమతిస్తున్నారు. ఈ విధానం వల్ల తోపులాటలకు ఆస్కారం లేకుండా దర్శనాలు ప్రశాంతంగా జరుగుతున్నాయని అధికారులు తెలిపారు.