తెలంగాణ ప్రభుత్వం పోలీస్ శాఖలో భారీ మార్పులకు శ్రీకారం చుట్టింది. రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ, మల్కాజ్‌గిరితో పాటు పలు జిల్లాల్లో విధులు నిర్వహిస్తున్న మొత్తం 20 మంది ఐపీఎస్ అధికారులకు కొత్త పోస్టింగులు కేటాయించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు గవర్నర్ పేరిట జీఓ ఆర్టీ నెం. 75 ద్వారా ఉత్తర్వులను విడుదల చేశారు.
ఈ బదిలీల్లో భాగంగా సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్‌గా పనిచేస్తున్న 2008 బ్యాచ్ ఐపీఎస్ అధికారి డాక్టర్ గజారావు భూపాల్‌ను ప్రొవిజనింగ్ అండ్ లాజిస్టిక్స్ ఐజీగా బదిలీ చేశారు. ఆయనకు స్పోర్ట్స్ అండ్ వెల్ఫేర్ ఐజీగా పూర్తి అదనపు బాధ్యతలు కూడా అప్పగించారు. అలాగే తెలంగాణ నార్కోటిక్స్ బ్యూరో డీఐజీగా ఉన్న 2011 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అభిషేక్ మహంతిని విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీఐజీగా నియమించారు.
ఇంటెలిజెన్స్ సీఐ సెల్ ఎస్పీగా పనిచేస్తున్న ఆర్. భాస్కరన్‌కు డీఐజీగా పదోన్నతి కల్పించి, అదే విభాగంలో కొనసాగించారు. రైల్వేస్ సికింద్రాబాద్‌లో ఎస్పీ/డీఐజీగా ఉన్న జి. చందన దీప్తిని ఫ్యూచర్ సిటీ అదనపు కమిషనర్ ఆఫ్ పోలీస్ (అడ్మిన్ & ట్రాఫిక్)గా నియమించారు.
హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్లలో ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ విభాగాల్లోనూ విస్తృత స్థాయిలో మార్పులు చోటుచేసుకున్నాయి. విజిలెన్స్ & ఎన్‌ఫోర్స్‌మెంట్, ఇంటెలిజెన్స్, సీఐడీ, ట్రాఫిక్ విభాగాలకు పలువురు అధికారులను బదిలీ చేయడంతో పాటు, కొందరికి పదోన్నతులు కల్పించారు. జిల్లాల్లో ఏఎస్పీలుగా పనిచేస్తున్న పలువురు అధికారులను డీసీపీ స్థాయికి పదోన్నతి ఇచ్చి హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్‌గిరి కమిషనరేట్లలో ట్రాఫిక్ బాధ్యతలు అప్పగించారు.
విజిలెన్స్ & ఎన్‌ఫోర్స్‌మెంట్‌లో అదనపు ఎస్పీగా పనిచేస్తున్న ఎ. బాలకోటిని డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ బదిలీలతో ముఖ్యంగా హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్‌గిరి పరిధిలో ట్రాఫిక్ నిర్వహణ, పరిపాలన మరింత పటిష్టం కానుందని అధికార వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
రాష్ట్ర పోలీస్ వ్యవస్థలో సమర్థతను పెంచడం, పరిపాలనను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ బదిలీలు చేపట్టినట్లు సమాచారం. కొత్తగా బాధ్యతలు స్వీకరించే అధికారులు త్వరలో తమ పోస్టుల్లో చేరనున్నారు.










