శ్రీహరికోట: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో ప్రతిష్ఠాత్మక మైలురాయిని అధిగమించింది. తన అత్యంత శక్తిమంతమైన ‘బాహుబలి’ రాకెట్ ఎల్వీఎం3-ఎం6 (LVM3-M6) ద్వారా అమెరికాకు చెందిన ‘బ్లూబర్డ్-6’ (BlueBird-6) కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని బుధవారం విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టింది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోటలో ఉన్న సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి జరిగిన ఈ ప్రయోగం భారత అంతరిక్ష రంగ చరిత్రలోనే అతిపెద్ద వాణిజ్య విజయంగా నిలిచింది.
ఉదయం 8:55 గంటలకు రెండో ప్రయోగ వేదిక (సెకండ్ లాంచ్ ప్యాడ్) నుంచి 43.5 మీటర్ల ఎత్తున్న ఎల్వీఎం3 రాకెట్ గంభీరంగా నింగిలోకి దూసుకెళ్లింది. ప్రయోగం ప్రారంభమైన సుమారు 15 నిమిషాల్లోనే రాకెట్ లక్ష్యాన్ని చేరుకుని, భూమికి సుమారు 520 కిలోమీటర్ల ఎత్తులో ‘బ్లూబర్డ్-6’ ఉపగ్రహాన్ని నిర్ణీత కక్ష్యలో విజయవంతంగా స్థాపించింది. సుమారు 6,100 కిలోల బరువున్న ఈ ఉపగ్రహం భారత గడ్డపై నుంచి ప్రయోగించిన అత్యంత భారీ వాణిజ్య ఉపగ్రహంగా రికార్డు సృష్టించింది.
అమెరికాకు చెందిన ‘ఏఎస్‌టీ స్పేస్‌మొబైల్’ సంస్థ రూపొందించిన ఈ ఉపగ్రహం ప్రత్యేకత ఏమిటంటే.. అదనపు పరికరాలు లేకుండానే సాధారణ స్మార్ట్‌ఫోన్లకు నేరుగా అంతరిక్షం నుంచి 4G/5G బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందించే సామర్థ్యం కలిగి ఉండటం. ప్రపంచవ్యాప్తంగా మొబైల్ కనెక్టివిటీ రంగంలో ఇది విప్లవాత్మక మార్పులకు దారి తీస్తుందని నిపుణులు చెబుతున్నారు.
ఈ ప్రయోగంలో ఒక ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. వాస్తవానికి రాకెట్‌ను ఉదయం 8:54 గంటలకు ప్రయోగించాల్సి ఉండగా, రాకెట్ ప్రయాణ మార్గంలో అంతరిక్ష వ్యర్థాలు లేదా ఇతర ఉపగ్రహాలతో ఢీకొనే అవకాశం ఉందని ఇస్రో శాస్త్రవేత్తలు గుర్తించారు. దీంతో అప్రమత్తమైన ఇస్రో, కచ్చితమైన సమయ నిర్వహణతో ప్రయోగాన్ని 90 సెకన్ల పాటు వాయిదా వేసి ఉదయం 8:55 గంటల 30 సెకన్లకు ప్రయోగించింది. ఈ నిర్ణయంతో ఒక పెద్ద ప్రమాదాన్ని తప్పించి ప్రయోగాన్ని విజయవంతం చేసింది.
ప్రయోగం అనంతరం ఇస్రో చైర్మన్ డాక్టర్ వి. నారాయణన్ మీడియాతో మాట్లాడుతూ, “ఎల్వీఎం3 రాకెట్ మరోసారి తన అద్భుతమైన విశ్వసనీయతను నిరూపించుకుంది. ప్రపంచంలోని అత్యుత్తమ రాకెట్లలో ఇది ఒకటని మరోసారి రుజువైంది” అని అన్నారు. ఇది ఇస్రో చేపట్టిన మూడవ పూర్తి స్థాయి వాణిజ్య ప్రయోగం కావడం విశేషం. ఈ విజయంతో అంతర్జాతీయ వాణిజ్య అంతరిక్ష మార్కెట్‌లో ఇస్రో స్థానం మరింత బలపడిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.










