జగిత్యాల జిల్లా మెట్‌పల్లి పట్టణంలోని బి.ఆర్.ఎస్ పార్టీ కార్యాలయంలో కోరుట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే డా. కల్వకుంట్ల సంజయ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కోరుట్ల నియోజకవర్గ పరిధిలోని ఆటో డ్రైవర్లను ఆదుకునేందుకు తన స్వంత నిధులతో ప్రమాద బీమా మరియు ఆరోగ్య బీమా చేయిస్తామని ప్రకటించారు.
తెలంగాణ రాష్ట్రంలో గత రెండేళ్లుగా కాంగ్రెస్ పాలనలో ఆటో డ్రైవర్లు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నారని ఆయన మండిపడ్డారు. డ్రైవర్లకు గిరాకీ తగ్గిపోయి కుటుంబాలు గడవడమే కష్టంగా మారిందన్నారు. బి.ఆర్.ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఆటో డ్రైవర్లపై ఉన్న పన్నులను రద్దు చేసి వారిని ఆదుకున్నామని గుర్తు చేశారు.
టిఆర్ఎస్ (బి.ఆర్.ఎస్) పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తారక రామారావును ఆదర్శంగా తీసుకుని, కోరుట్ల నియోజకవర్గంలోని అన్ని ఆటో డ్రైవర్లకు ప్రమాద బీమా, ఆరోగ్య బీమా కలిగిన గ్రూప్ ఇన్సూరెన్స్ అమలు చేస్తున్నట్లు డా. సంజయ్ తెలిపారు. అలాగే గ్రామాల నుంచి పట్టణాలకు వచ్చి దుకాణాలు, ఇతర సంస్థల్లో పనిచేస్తున్న కార్మికులకు కూడా ప్రమాద బీమా కల్పించనున్నట్లు పేర్కొన్నారు.
ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆటో డ్రైవర్లకు చల్మెడ హాస్పిటల్‌లో ఉచిత వైద్య సేవలు అందించనున్నట్లు ఆయన వెల్లడించారు. బి.ఆర్.ఎస్ పార్టీ ఎప్పుడూ కార్మిక వర్గాల సంక్షేమానికే ప్రాధాన్యత ఇస్తుందని, భవిష్యత్తులో కూడా వారి తరఫున నిలబడుతామని డా. కల్వకుంట్ల సంజయ్ స్పష్టం చేశారు.









