ఝార్ఖండ్‌లో అత్యంత దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. గర్హ్వా జిల్లాలో ఇద్దరు గిరిజన బాలికలను కిడ్నాప్ చేసిన దుండగులు అడవిలోకి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. నవరాత్రి ఉత్సవాల సమయంలో జరిగిన ఈ అమానుష ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఒక నిందితుడిని అరెస్ట్ చేయగా, మరో ముగ్గురు పరారీలో ఉన్నారు.
పోలీసుల కథనం ప్రకారం.. రంకా పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగరి గ్రామానికి చెందిన ముగ్గురు బాలికలు తమ స్నేహితులతో కలిసి నవరాత్రి జాతరకు వెళ్లారు. జాతర ముగించుకుని ఇంటికి తిరిగి వస్తుండగా, మార్గమధ్యంలో ఓ స్కార్పియో వాహనం వారి వద్ద ఆగింది. అందులో నుంచి దిగిన నలుగురు వ్యక్తులు బలవంతంగా ఆ ముగ్గురు బాలికలను వాహనంలోకి ఎక్కించుకున్నారు. బాలికలతో ఉన్న యువకులు అడ్డుకోవడానికి ప్రయత్నించగా, నిందితులు వారిని తీవ్రంగా కొట్టి అక్కడి నుంచి తరిమేశారు.
అనంతరం వాహనంలో బాలికలను అటవీ ప్రాంతం వైపు తీసుకెళ్లారు. బాధితుల్లో ఒక బాలిక ప్రాధేయపడటంతో నిందితులు ఆమెను దారి మధ్యలోనే వదిలేశారు. మిగిలిన ఇద్దరు బాలికలను అడవిలోని ఓ నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి, నలుగురు దుండగులు ఒకరి తర్వాత మరొకరు అత్యాచారానికి పాల్పడ్డారు. మరుసటి రోజు ఉదయం బాధితులు ఎలాగోలా ఇంటికి చేరుకుని, తమ కుటుంబ సభ్యులకు జరిగిన ఘోరాన్ని వివరించారు.
కుటుంబ సభ్యులు వెంటనే రంకా పోలీస్ స్టేషన్‌లో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. బాధితుల వాంగ్మూలం ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితులైన మండీశ్ యాదవ్, శంకర్ యాదవ్, ఓం ప్రకాశ్ యాదవ్‌తో పాటు మరో గుర్తుతెలియని వ్యక్తిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. వేగంగా స్పందించిన పోలీసులు, నిందితుల్లో ఒకరిని అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. పరారీలో ఉన్న మిగతా ముగ్గురు నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టామని, వారిని త్వరలోనే పట్టుకుంటామని అధికారులు వెల్లడించారు.