కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా / కాగజ్నగర్ : కాగజ్నగర్ పట్టణంలో స్క్రాప్ దుకాణాలు పుట్టగొడుగుల్లా విస్తరిస్తున్నాయి. నిబంధనల ప్రకారం జనావాసాలకు దూరంగా ఏర్పాటు చేయాల్సిన స్క్రాప్ యార్డులను జనావాసాల మధ్యే ఏర్పాటు చేసేందుకు అనుమతులు ఇచ్చిన అధికారి ఎవరు అనే ప్రశ్న ప్రజల్లో తలెత్తుతోంది.
పట్టణంలోని పలు కాలనీల్లో స్క్రాప్ దుకాణాలు ఉండటంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రెండు హాస్టళ్ల మధ్యలోనే ఒక స్క్రాప్ యార్డ్ కొనసాగుతుండటంతో విద్యార్థులు రాకపోకలకు ఇబ్బందిపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో స్క్రాప్ యార్డుల కారణంగా ప్రమాదాలు జరిగి ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లిన సంఘటనలు ఉన్నప్పటికీ యాజమాన్యాలు మాత్రం నిబంధనలను పట్టించుకోవడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
కాగజ్నగర్ పట్టణంలోని పెట్రోల్ పంపు ఏరియా, ప్రధాన రహదారికి ఆనుకొని పదుల సంఖ్యలో స్క్రాప్ దుకాణాలు వెలిశాయి. అధికారుల అండదండలతోనే ఈ అక్రమ వ్యాపారం కొనసాగుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. జనావాసాల్లో స్క్రాప్ యార్డులు ఏర్పాటు చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
స్క్రాప్ యార్డుల్లో ప్లాస్టిక్, రబ్బరు, రాగి, సీసం, కంచు, ఇనుము, వాహనాల తుక్కు వంటి నిరుపయోగ వస్తువులను తూకం వేస్తూ రోడ్లపైనే కుప్పలుగా వేయడం వల్ల రాకపోకలకు ఆటంకం ఏర్పడుతోంది. దీంతో పాటు ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతోందని ఆరోపణలు ఉన్నాయి.
కనీస నిబంధనలైన అగ్నిమాపక పరికరాలు, నీటి సౌకర్యం, ఇసుక, ఆక్సిజన్ సిలిండర్లు వంటి భద్రతా చర్యలు ఎక్కడా కనిపించడం లేదని ప్రజలు అంటున్నారు. స్క్రాప్ యార్డుల నిర్వాహకుల నిర్లక్ష్యం వల్ల ఎప్పుడైనా భారీ ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది.
పేర్లు, బోర్డులు లేకుండానే అనేక స్క్రాప్ దుకాణాలు నడుస్తుండటం, తనిఖీలు శూన్యంగా ఉండటంతో స్క్రాప్ దందాకు అడ్డు అదుపు లేకుండా పోతోందని విమర్శలు ఉన్నాయి. పట్టణంలో దొంగతనాలు పెరుగుతుండగా, దొంగిలించిన కార్లు, బైకులు, ప్రభుత్వ ఎలక్ట్రానిక్ పరికరాలు కూడా స్క్రాప్ యార్డుల్లో దర్శనమివ్వడం అనుమానాలకు తావిస్తోంది.
అధికారుల నిర్లక్ష్యం?
పట్టణంలోని ప్రధాన రహదారులు, పెట్రోల్ పంపు ఏరియా, పలు పురవీధుల్లో కొనసాగుతున్న స్క్రాప్ దుకాణాలకు అసలు అనుమతులు ఉన్నాయా లేదా అన్నది మున్సిపల్ అధికారులు పరిశీలించాల్సిన అవసరం ఉందని ప్రజలు కోరుతున్నారు. అధికారుల పట్టింపులేమితో స్క్రాప్ దుకాణాల వద్ద చెత్త కుప్పలుగా పేరుకుపోతున్నా చర్యలు లేకపోవడం గమనార్హం.
స్క్రాప్ దుకాణాల నిర్వాహకులతో అధికారులు చేతివాటానికి అలవాటు పడ్డారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి, స్క్రాప్ యార్డులకు లైసెన్సులు, ఫైర్ సేఫ్టీ నిబంధనలు, ఇతర ప్రభుత్వ మార్గదర్శకాలను కచ్చితంగా అమలు చేయాలని, నిబంధనలు ఉల్లంఘించిన యార్డులకు నోటీసులు జారీ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.









