కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా : కాగజ్‌నగర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కార్మికుల సమ్మె 17వ రోజుకు చేరింది. తమ డిమాండ్లు పరిష్కరించాలంటూ కార్మికులు నాలుగు రోజులుగా మున్సిపల్ కార్యాలయాన్ని దిగ్బంధనం చేసి ఆందోళన కొనసాగిస్తున్నారు.
ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా అధ్యక్షులు రాజేందర్ మాట్లాడుతూ, మున్సిపల్ కార్మికులకు ఐదు నెలల వేతనాలు బకాయి ఉండటంతో పాటు దాదాపు రెండు కోట్ల రూపాయల మేర బకాయిలు ఉన్నాయని తెలిపారు. ఈ సమస్యల పరిష్కారం కోసం గత మూడు నెలలుగా జిల్లా కలెక్టర్, సబ్ కలెక్టర్, మున్సిపల్ కమిషనర్‌లకు వినతిపత్రాలు అందజేశినప్పటికీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపించారు. అందుకే కార్మికులు సమ్మె బాట పట్టాల్సి వచ్చిందన్నారు.
సమ్మెలో భాగంగా కలెక్టర్, సబ్ కలెక్టర్, ఎమ్మెల్సీతో చర్చలు జరిగినప్పటికీ అవి అనుకూలంగా సాగలేదని, అందువల్ల సమ్మెను కొనసాగిస్తున్నామని తెలిపారు. తమ డిమాండ్లపై స్పష్టమైన హామీ వచ్చే వరకు ఆందోళన విరమించబోమని స్పష్టం చేశారు.
అవసరమైతే సమ్మెను మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించిన రాజేందర్, కాగజ్‌నగర్ మున్సిపాలిటీ నుంచి ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు పాదయాత్ర నిర్వహించి జిల్లా కార్యాలయాన్ని కూడా దిగ్బంధనం చేస్తామని ప్రకటించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్మికులు, కార్మిక సంఘ నాయకులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.









