కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా : కాగజ్‌నగర్ పట్టణంలో బిఆర్ఎస్ (BRS) పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ తీరుపై అసహనంతో అర్సద్ హుస్సేన్ తన రాజీనామాను ప్రకటించారు. ఆయన ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతూ. కేటీఆర్ వ్యవహారశైలి పార్టీ నమ్ముకున్న కార్యకర్తలకు అన్యాయం జరుగుతోందని, ముఖ్యంగా కేటీఆర్ పనితీరుపై అర్సద్ హుస్సేన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికలలో పట్టణంలోని 30 వార్డులలో ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్కి 6, కోనప్పకు 24 టికెట్లు ఇస్తామని చెప్పడంపై ఆయన అభ్యంతరం తెలిపారు. మాజీ ఎమ్మెల్యే కోనప్ప దౌర్జన్యాలను తట్టుకోలేకే ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్‌ను నియోజకవర్గానికి ఆహ్వానించామని, అయితే ఇప్పుడు మళ్ళీ ఆయనకే ప్రాధాన్యత ఇవ్వడం మాట తప్పడమేనని విమర్శించారు. సమ్మక్క గద్దెల వద్ద ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పోలీసులను ఉద్దేశించి చేసిన అనుచిత వ్యాఖ్యలను అర్సద్ తీవ్రంగా ఖండించారు. ముస్లిం సమాజాన్ని కించపరిచేలా మాట్లాడిన కౌశిక్ రెడ్డిని వెంటనే పార్టీ నుండి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.








