కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్‌నగర్ పట్టణంలో గత కొంతకాలంగా వరుస దొంగతనాలతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న దొంగల ముఠాను పట్టణ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. నిందితుల నుంచి సుమారు రూ.2,75,000 విలువైన బంగారం మరియు వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
జనవరి 3వ తేదీన సిర్పూర్ కాలనీకి చెందిన దండే మంగా అనే మహిళ తన ఇంటికి తాళం వేసి హైదరాబాద్ వెళ్లగా, గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి తాళాలు పగలగొట్టి 7.5 తులాల బంగారం, ఒక కిలో వెండి వస్తువులను అపహరించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
విశ్వసనీయ సమాచారం మేరకు ఫిబ్రవరి 26వ తేదీ గురువారం మధ్యాహ్నం పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో అనుమానాస్పదంగా కనిపించిన ఏ1 ఇర్షాద్ పాషా అనే జెసిబి డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. తన అనుచరులైన షేక్ అంజాద్ (ఏ2), మిర్జా సోహైల్ బేగ్ (ఏ3)లతో కలిసి తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేసి దొంగతనాలకు పాల్పడుతున్నట్లు నిందితుడు అంగీకరించాడు.
అపహరించిన సొత్తును కొనుగోలు చేసిన గోల్డ్‌స్మిత్ చిలుకూరి శ్రీకాంత్ (ఏ4)ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు కేవలం ఈ ఒక్క కేసులోనే కాకుండా, కాగజ్‌నగర్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన మరో ఆరు ఆస్తి నేరాల్లో కూడా ప్రమేయం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మొత్తం ఏడు కేసుల్లో వీరు నిందితులుగా ఉన్నట్లు వెల్లడించారు.
సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతోనే ఈ ముఠా గత కొంతకాలంగా నేరాలకు పాల్పడుతోందని పోలీసులు తెలిపారు.
ఈ సందర్భంగా ప్రజలకు పోలీసులు పలు సూచనలు చేశారు:
-
ఇళ్లకు పటిష్టమైన తాళాలు వేసుకోవాలి.
-
నివాస ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి.
-
అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించాలి.
ప్రస్తుతం నిందితులను రిమాండ్‌కు తరలించి, కేసుపై తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో టౌన్ సీఐ ప్రేమ్ కుమార్, ఎస్సై సుధాకర్, కానిస్టేబుళ్లు రాజేష్, పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.








