కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా: పెంచికల్‌పేట మండల పరిధిలో గర్భిణీ గిరిజన మహిళను దారుణంగా హత్య చేసిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ సంఘటనతో గ్రామాల్లో భయాందోళనలు నెలకొన్నాయి.
పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, కొండపల్లి గ్రామానికి చెందిన ఆత్రం సమ్మక్క (25)కు జైహింద్‌పూర్ హామ్లెట్‌కు చెందిన కెల్కరి జలపతి అనే వ్యక్తితో గత నాలుగేళ్లుగా సన్నిహిత సంబంధం కొనసాగుతోంది. ప్రస్తుతం సమ్మక్క ఏడు నెలల గర్భిణీగా ఉండగా, తనను వివాహం చేసుకోవాలని జలపతిపై ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం.
ఇప్పటికే వివాహితుడైన జలపతి, ఈ పరిస్థితిని ఎదుర్కొనే బదులు సమ్మక్కను అడ్డు తొలగించుకోవాలని పన్నాగం పన్నినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో శనివారం ఆమెను జైహింద్‌పూర్ ప్రాంతానికి పిలిపించి, అక్కడి నుంచి కొండపల్లి–సులుగుపల్లి గ్రామాల మధ్య ఉన్న అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి దారుణంగా హత్య చేసినట్లు వెల్లడైంది.
హత్య అనంతరం నిందితుడు జలపతి స్వయంగా తన సోదరుడికి ఫోన్ చేసి జరిగిన విషయాన్ని తెలిపినట్లు సమాచారం. ఈ సమాచారంతో అప్రమత్తమైన పోలీసులు అటవీ ప్రాంతంలో గాలింపు చేపట్టి, సమ్మక్క మృతదేహాన్ని గుర్తించారు.
మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం సిర్పూర్ (టి) ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కాగజ్‌నగర్ రూరల్ ఇన్‌స్పెక్టర్ కుమారస్వామి మాట్లాడుతూ, నిందితుడు జలపతిపై భారతీయ న్యాయ సంహిత కింద హత్య కేసుతో పాటు ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రకారం కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ ఘటనపై బాధితురాలి కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ, నిందితుడికి కఠిన శిక్ష విధించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.







