కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ మండలం వల్లకొండ పంచాయతీ పరిధిలోని సీతానగర్ శివారులో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. ఓ పత్తి చేనులో గుడ్డల్లో చుట్టి పడేసిన పసికందును స్థానికులు గుర్తించడం కలకలం రేపింది.
పొలాల్లో పనుల నిమిత్తం వెళ్లిన రైతులు, అక్కడి గడ్డిలో కదలిక గమనించి దగ్గరగా వెళ్లి చూడగా, గుడ్డల్లో చుట్టి ఉన్న శిశువును చూసి షాక్‌కు గురయ్యారు. వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న పోలీసులు తక్షణమే ఘటనాస్థలానికి చేరుకుని, ఆ పసికందును సురక్షితంగా బయటకు తీశారు. అనంతరం చికిత్స మరియు సంరక్షణ కోసం సమీపంలోని శిశు సంరక్షణ కేంద్రానికి తరలించారు. ప్రస్తుతం శిశువు ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు సమాచారం.

ఈ అమానుష ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. శిశువును ఈ విధంగా వదిలేసిన వారు ఎవరన్న కోణంలో విచారణ చేపట్టి, నిందితులను గుర్తించేందుకు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపగా, మానవత్వం ఎక్కడికి పోయిందన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. పసికందును నిర్దాక్షిణ్యంగా వదిలేసిన ఈ చర్యపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.








