కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో హృదయాలను కదిలించిన సంఘటన వెలుగులోకి వచ్చింది. కాగజ్‌నగర్ మండలం, వల్లకొండ పంచాయతీ పరిధిలోని సీతానగర్ శివారులో ఒక పత్తి చేనులో గుడ్డల్లో చుట్టి పడేసి ఉన్న పసికందును గ్రామస్తులు గుర్తించారు. శిశువు ఏడుపు విన్న స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న ఎస్.ఐతో పాటు డీసీపీఓ మహేష్ ఘటనాస్థలికి చేరుకుని శిశువును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వెంటనే సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. కాగజ్‌నగర్ మరియు ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులు శిశువుకు మెరుగైన చికిత్స అందించి ప్రాణాపాయం నుంచి కాపాడారు. ప్రస్తుతం శిశువు ఆరోగ్యం స్థిరంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
ఈ ఘటనపై జిల్లా ఎస్పీ నితికా పంత్ ప్రత్యేక దృష్టి సారించారు. ఆమె స్వయంగా ఆసుపత్రిని సందర్శించి శిశువు ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, అవసరమైన అన్ని వైద్య సదుపాయాలు అందించాలని అధికారులను ఆదేశించారు.
ఇక శిశువు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని జిల్లా సంక్షేమ అధికారి ఆడెపు భాస్కర్ ఆధ్వర్యంలో శిశువును ఆదిలాబాద్‌లోని శిశు గృహానికి తరలించారు. చట్టబద్ధ నిబంధనల ప్రకారం భవిష్యత్తులో శిశువును దత్తతకు ఇవ్వనున్నట్లు అధికారులు వెల్లడించారు.
ఈ సంఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. ఒకవైపు తల్లిదండ్రుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తమవుతుండగా, మరోవైపు సమయానికి స్పందించి శిశువు ప్రాణాలు కాపాడిన గ్రామస్తులు, పోలీసులు, వైద్య సిబ్బందిపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.








