కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో అంగన్‌వాడీ కేంద్రాల పనితీరును సమీక్షించేందుకు ఢిల్లీ బృందం సోమవారం పర్యటించింది. కెరమెరి మండలంలోని గోయగాం, బారేమోడి, అంతపూర్ గ్రామాల అంగన్‌వాడీ కేంద్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ అక్కడి సదుపాయాలు, పిల్లల ఆరోగ్య పరిస్థితులను అధ్యయనం చేశారు.
ఈ పర్యటనలో ఢిల్లీ నుంచి వచ్చిన NCOE సభ్యులు మరియు యూనిసెఫ్ ప్రతినిధులు పాల్గొన్నారు. వారు అంగన్‌వాడీ టీచర్లతో మాట్లాడి, పోషకాహార లోపంతో బాధపడుతున్న పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. పిల్లల ఎత్తు, బరువులను ఖచ్చితంగా కొలవడం ద్వారా వారి ఆరోగ్య స్థితిని అంచనా వేసి, సరైన పోషకాహార ప్రణాళికను అమలు చేయాలని తెలిపారు.
అనంతరం బృందం జిల్లా కలెక్టర్ కె. హరితను మర్యాదపూర్వకంగా కలిసి, క్షేత్రస్థాయి పర్యటనలో గమనించిన అంశాలను వివరించింది. అంగన్‌వాడీ కేంద్రాల పనితీరును మరింత మెరుగుపరచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి డాక్టర్ భాస్కర్, యూనిసెఫ్ రాష్ట్ర ప్రతినిధి నరసింహారావు, జిల్లా సమన్వయకర్త గోపాలకృష్ణ, నరేష్, అంగన్‌వాడీ సూపర్‌వైజర్లు తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో బాలల పోషకాహార స్థితిని మెరుగుపరచడంలో ఈ పర్యటన కీలకంగా నిలుస్తుందని అధికారులు అభిప్రాయపడ్డారు.








