కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా: జిల్లాలో అక్రమ ఇసుక రవాణాపై జిల్లా కలెక్టర్ కె. హరిత కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఆమె ఆదేశాల మేరకు అధికారులు క్షేత్రస్థాయిలో మెరుపు దాడులు నిర్వహించి, నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తరలిస్తున్న ఏడు ట్రాక్టర్లను సీజ్ చేశారు.
కాగజ్‌నగర్ పరిధిలోని పెద్ద వాగు నుంచి రాంపూర్ గ్రామానికి అనుమతి పత్రాలు లేకుండా ఇసుక తరలిస్తున్న మూడు ట్రాక్టర్లను అధికారులు పట్టుకున్నారు. అలాగే ఆసిఫాబాద్‌లో ఏఎస్పీ చిత్తరంజన్ పర్యవేక్షణలో, ఎస్సైలు జాడే శ్యామ్ రావు, కమలాకర్ బృందం పెద్ద వాగు సమీపంలో నాలుగు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కె. హరిత మాట్లాడుతూ, ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని హెచ్చరించారు. అక్రమ రవాణాకు పాల్పడితే కఠినమైన చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
అక్రమ ఇసుక రవాణా వల్ల భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయని, దీనిని అరికట్టేందుకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సహజ వనరులను కాపాడుకోవడం ద్వారానే పర్యావరణాన్ని రక్షించుకోవచ్చని పేర్కొన్నారు.
జిల్లాలో ఎక్కడైనా అక్రమ కార్యకలాపాలు గమనించిన వెంటనే పోలీసులకు లేదా జిల్లా యంత్రాంగానికి సమాచారం అందించాలని ప్రజలను కలెక్టర్ కోరారు.








