కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా : కాగజ్‌నగర్ పట్టణంలోని బట్టుపల్లి చౌరస్తా ఫ్లైఓవర్ వద్ద సోమవారం చోటుచేసుకున్న ఘటన స్థానిక ప్రజల్లో తీవ్ర ఆగ్రహానికి దారితీసింది. యూరియా ఎరువుల కొరతపై రైతులతో కలిసి ధర్నాలో పాల్గొన్న సిర్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ హరీష్‌బాబు, అదే సమయంలో ఆసుపత్రికి వెళ్లాల్సిన అంబులెన్స్‌కు దారి ఇవ్వకుండా మొండిగా వ్యవహరించారనే ఆరోపణలు ప్రజల్లో తీవ్ర అసంతృప్తికి కారణమయ్యాయి.
పెంచికల్పేట్ మండలానికి చెందిన ఓ గర్భిణి తీవ్ర ప్రసవ నొప్పులతో అంబులెన్స్‌లో కాగజ్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపవుతుండగా, ఫ్లైఓవర్ వద్ద జరుగుతున్న ధర్నా కారణంగా రాహదారి పూర్తిగా స్తంభించిపోయింది. పరిస్థితిని స్పష్టంగా గమనించినా, ఎంఎల్ఏ హరీష్‌బాబు తక్షణంగా స్పందించకపోవడం ప్రజల్లో ఆందోళన రేకెత్తించింది.
“చిరుద్యోగులు అయినా, ముఖ్యమంత్రులైనా అంబులెన్స్ వస్తే తక్షణమే దారి ఇస్తారు. కానీ ప్రజల ప్రాణాలకు ప్రాధాన్యం ఇవ్వకుండా మొండిగా వ్యవహరించడం దారుణం,” అని స్థానికులు మండిపడ్డారు.
తనే ఒక డాక్టర్‌గా చదువుకున్న వ్యక్తి ఇలాంటి నిర్లక్ష్య వైఖరితో వ్యవహరించడం మరింత నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.
ప్రమాదంలో చిక్కుకున్న గర్భిణికి విలువైన సమయం వృథా కావడం పట్ల పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. చివరికి ప్రజల ఒత్తిడికి లొంగి అంబులెన్స్‌కు దారి కల్పించినా, అప్పటికే జరిగిన ఆలస్యం వల్ల అక్కడ ఉద్రిక్తతలు తలెత్తాయి.
ఈ ఘటనపై అధికారికంగా ఎటువంటి స్పందన రానప్పటికీ, ప్రజల ప్రాణాలకు మించిన రాజకీయం ఉండదన్న సందేశం ఈ ఘటన మళ్లీ గుర్తు చేసింది.