కొమరం భీం, ఆసిఫాబాద్ జిల్లా – కాగజ్‌నగర్ : సిర్పూర్ పేపర్ మిల్లులలో చోటుచేసుకున్న ప్రమాదం మరో కార్మికుడి ప్రాణాలను బలి తీసుకుంది. ఫైబర్ లైన్లో అమెజాన్ కాంట్రాక్టర్ కింద పనిచేస్తున్న భాస్కర్ అనే కార్మికుడు, ఈ నెల 3వ తేదీ బుధవారం జరిగిన ఘటనలో తీవ్రంగా గాయపడి, చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతిచెందాడు. పేపర్ మిల్లులో పనిలో నిమగ్నమై ఉన్న సమయంలో కెమికల్ భాస్కర్‌పై పడటంతో తీవ్ర గాయాలు అయ్యాయి. సహచరులు వెంటనే స్పందించి స్థానికంగా చికిత్స అందించినా ఫలితం లేకపోవడంతో, పరిస్థితి విషమించడంతో ఆయనను హైదరాబాద్‌లోని కార్పొరేట్ ఆస్పత్రికి తరలించారు. దాదాపు 18 రోజులపాటు వైద్యులు భాస్కర్ ప్రాణాలను కాపాడేందుకు ప్రయత్నించినా, శరీరంపై తీవ్రంగా ప్రభావం చూపిన కెమికల్ కారణంగా ఆరోగ్యం క్షీణించింది. చివరికి ఆదివారం ఉదయం ప్రాణాలు విడిచాడు.
కుటుంబంలో విషాదం:
భాస్కర్ మృతి వార్తతో కుటుంబ సభ్యులు మౌనం వీడక విలపిస్తున్నారు. కూలీ పనులతోనే కుటుంబాన్ని నెట్టుకొస్తున్న భాస్కర్ మరణంతో వారి భవిష్యత్తు చీకటిమయమైందని బంధువులు కన్నీరు మున్నీరవుతున్నారు. సహోద్యోగులు సైతం ఫ్యాక్టరీ యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తగిన భద్రతా చర్యలు తీసుకోకపోవడం వల్లే ఇలాంటి దుర్ఘటనలు జరుగుతున్నాయని వారు మండిపడుతున్నారు.