కొమరం భీమ్,ఆసిఫాబాద్ జిల్లా – కాగజ్ నగర్ : కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ పట్టణంలోని రుద్ర హాస్పిటల్ మళ్లీ వివాదాస్పదంగా మారింది. సీతానగర్‌కు చెందిన మౌల్కర్ అమృత (40) గురువారం చికిత్స పొందుతూ మృతి చెందింది. అయితే ఆసుపత్రి యాజమాన్యం వైద్య బిల్లు మొత్తం చెల్లించకపోతే మృతదేహాన్ని అప్పగించబోమని కుటుంబ సభ్యులకు స్పష్టంచేయడంతో కలకలం రేగింది. ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న మృతురాలి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. మానవత్వానికి విరుద్ధంగా ఆసుపత్రి వ్యవహరిస్తోందని స్థానికులు తీవ్రంగా మండిపడ్డారు. గతంలోనూ రుద్ర హాస్పిటల్ వైద్య నిర్లక్ష్యం ఆరోపణలు ఎదుర్కొంది. డేట్ అయిపోయిన సెలైన్‌ను ఓ బాలునికి ఎక్కించడం జరిగిందని అప్పట్లో పెద్ద వివాదమే చెలరేగింది. ఇక రాజకీయ రంగంలోనూ ఈ ఘటనకు సంబంధించి గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆసుపత్రి యజమాని ఆర్మీలో ఉద్యోగం చేసి విరమణ పొందిన అనంతరం ఈ ఆసుపత్రి నడుపుతున్నాడు. అయితే ఆయన స్థానిక ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడిగా, బీజేపీ కాగజ్‌నగర్ టౌన్ అధ్యక్షుడి ముసుగులో ఏమి చేసినా చెల్లుతుందన్న అహంకారంతో వ్యవహరిస్తున్నారని ప్రజల్లో చర్చ జరుగుతోంది. ప్రజలు ఆసుపత్రిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఇటువంటి అన్యాయాలు పునరావృతం కాకుండా చూడాలని అధికారులను డిమాండ్ చేస్తున్నారు.
