- 8.33 శాతం బోనస్ కూడా ఇవ్వని యాజమాన్యం
- క్యాంటీన్ లేదు… భద్రతా చర్యలు లేవు… ప్రాణాలు తీస్తున్న మిల్లు
- నాలుగు సెలవులు తొలగింపు…నాలుగేళ్ల అగ్రిమెంట్ వివాదాస్పదం
- ప్రముఖ రాజకీయ నాయకుల షేర్లే అడ్డంకి – స్థానిక నేతల మౌనం.!
కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా, కాగజ్ నగర్ : సిర్పూర్ పేపర్ మిల్ (జేకే పేపర్) యాజమాన్యం కార్మికులను బానిసల మాదిరి వాడుకుంటోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కోట్ల రూపాయల ప్రభుత్వ సబ్సిడీలు, రాయితీలు లాక్కుంటూ… లాభాలను జేబులో వేసుకుంటూ… బోనస్ విషయంలో మాత్రం కార్మికులను మోసం చేస్తోందని కార్మికులు మండిపడుతున్నారు. 2018లో పునఃప్రారంభమైనప్పటి నుండి ఇప్పటివరకు మిల్లు యాజమాన్యం బోనస్ అనే పేరుతో కార్మికుల కష్టాన్ని దోచుకుంటూనే ఉందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. లాభాల్లో నడుస్తున్నా, శాశ్వతం–కాంట్రాక్టు కలిపి 700 మంది కార్మికులకు కేవలం రూ.10,000 నుండి రూ.16,000 మధ్య మాత్రమే బోనస్ కట్టిపెట్టి, మిగతా లాభాలను ఎక్కడికి మళ్లిస్తున్నారో ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇక మిల్లులో పరిస్థితి మరింత దారుణం. క్యాంటీన్ లేదు… భద్రతా చర్యలు లేవు… తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి… ప్రాణాలు కోల్పోయిన కార్మికుల కుటుంబాలకు నష్టపరిహారం కూడా రహస్యంగా ముసుగు కప్పేస్తున్నారు. కార్మిక కమిటీ పేరిట యాజమాన్యానికి వత్తాసు పలుకుతూ నాలుగేళ్ల అగ్రిమెంట్ కుదుర్చుకోవడం, కార్మికుల నాలుగు సెలవులు తొలగించడం మరింత ఆగ్రహానికి గురి చేస్తోంది. “కార్మిక కమిటీ కాదు… ఇది యాజమాన్యం చేతిలో బొమ్మ” అని కార్మికులు సూటిగా విరుచుకుపడుతున్నారు. మిల్లు లో ప్రముఖ రాజకీయ నాయకుల షేర్లు ఉన్నందునే మౌనం వహిస్తున్నారు. స్థానిక నాయకులు ప్యాకేజీలు తీసుకొని మిల్లుకు చుట్టుపక్కల కూడా రావడం లేదు” అంటూ ఘాటుగా విమర్శించారు. ప్రభుత్వం కార్మిక చట్టాల ఉల్లంఘనపై కళ్ళు మూస్తే, పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతుందని హెచ్చరిస్తున్నారు. “సబ్సిడీలు కోట్లలో ఇచ్చే ప్రభుత్వం… కార్మికులకు కనీస న్యాయం చేయమని ఎందుకు అడగట్లేదు?” అంటూ ప్రశ్నిస్తున్నారు. “కార్మిక శాఖ వెంటనే గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించకపోతే, ఈ మిల్లు మరోసారి కార్మిక ఉద్యమాల కేంద్రమవుతుందనీ కార్మికులు తెలిపారు..