కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా – కాగజ్‌నగర్ : కాగజ్‌నగర్ పట్టణంలోని మహాత్మా జ్యోతిబా ఫూలే బాలుర వసతి గృహంలో 7వ తరగతి చదువుతున్న అంకుసాపూర్ గ్రామానికి చెందిన విద్యార్థి ఆదే విజయ్ శనివారం సాయంత్రం పాము కాటుకు గురయ్యాడు. సహ విద్యార్థులు, సిబ్బంది అప్రమత్తమై అతన్ని తక్షణమే ఆస్పత్రికి తరలించారు. వార్త తెలుసుకున్న సిర్పూర్ ఎమ్మెల్యే డా. పాల్వాయి హరీష్ బాబు ఆదివారం ఆస్పత్రికి వెళ్లి విద్యార్థిని పరామర్శించారు. అనంతరం వైద్యులతో మాట్లాడి విద్యార్థికి మెరుగైన చికిత్స అందించాలని సూచించారు. విద్యార్థి ఆరోగ్య పరిస్థితి గురించి ఎమ్మెల్యే వివరాలు తెలుసుకుని తల్లిదండ్రులకు భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా హరీష్ బాబు మాట్లాడుతూ వసతి గృహాల్లో విద్యార్థుల భద్రతపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
