కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా / ఆదిలాబాద్ : ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న సిర్పూర్ పేపర్ మిల్ కార్మికుల గుర్తింపు సంఘం ఎన్నికల ప్రక్రియకు వేగం లభించింది. ఈ ఎన్నికలను వచ్చే నెల నవంబర్ చివరి వారంలో నిర్వహిస్తామని అదిలాబాద్ జిల్లా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ అధికారి రాజేశ్వరి హామీ ఇచ్చారు. మంగళవారం అదిలాబాద్‌లో జరిగిన యజమాన్యం, పేపర్ మిల్ కార్మిక సంఘాల సమావేశానికి అధ్యక్షత వహించిన ఆమె మాట్లాడుతూ మేనేజ్‌మెంట్‌తో మాట్లాడి నవంబర్ 3వ తేదీ లోపు పూర్తి కార్మికుల జాబితా తీసుకుంటామని, అనంతరం తుది జాబితాను ఖరారు చేసి, ఎన్నికల తేదీని ప్రకటిస్తామని వెల్లడించారు. సమావేశానికి మేనేజ్‌మెంట్ ప్రతినిధులు సాకులు చెబుతూ హాజరు కాలేదు. కార్మిక గుర్తింపు సంఘం రిజిస్ట్రేషన్ నంబర్ 0048 సహా మెజార్టీ యూనియన్ల గుర్తింపు సంఘంనాయకులు పాల్గొన్నారు. అనంతరం 0048 యూనియన్ ప్రధాన కార్యదర్శి ఈర్ల సతీష్ మాట్లాడుతూ యజమాన్యం ఎప్పటికప్పుడు ఎన్నికలు వాయిదా వేస్తూ వస్తోందని, కార్మికుల హక్కులను నిర్లక్ష్యం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై డీసీఎల్ రాజేశ్వరి స్పందిస్తూ యజమాన్యం తటస్థంగా ఉండకపోయినా, కార్మికుల హక్కులు కాపాడే బాధ్యత మాపై ఉందని, ఎన్నికలు నిర్దేశిత సమయానికి తప్పకుండా జరుగుతాయని స్పష్టం చేశారు. ఈ హామీతో కార్మిక వర్గాల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. ఎన్నాళ్లుగానో సాగిన అనిశ్చితి తొలగి, సిర్పూర్ పేపర్ మిల్‌లో మళ్లీ కార్మిక ఉద్యమానికి నూతన ఊపుని ఇచ్చే అవకాశం కనిపిస్తోంది.









