- సిర్పూర్ పేపర్ మిల్లులో కార్మికుడికి గాయం
- విలేఖరులపై ఆంక్షలు — నిజం బయటపడకూడదా ?
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా / కాగజ్‌నగర్: కాగజ్‌నగర్ సిర్పూర్ పేపర్ మిల్లులో మరోసారి భద్రతా లోపాలు బహిర్గతమయ్యాయి. శనివారం ఉదయం మిల్లులోని రికవరీ బాయిలర్ ఈవాప్రెటర్ విభాగంలో శుభ్రపరిచే పనుల సమయంలో పర్మినెంట్ కార్మికుడు చిలుక శ్రీనివాస్ (35) ప్రమాదానికి గురయ్యాడు. బ్లాక్ లిక్కర్ పడి ఉండటంతో జారి కింద పడ్డ ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి.
తోటి కార్మికులు వెంటనే స్పందించి ఆయనను స్థానిక ఆసుపత్రికి తరలించగా, వైద్యులు ఎడమ చేయి విరిగిందని తెలిపారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు.
అయితే ఘటన అనంతరం మిల్లులో ఆందోళన నెలకొంది. భద్రతా ప్రమాణాలు కేవలం కాగితాలకే పరిమితమయ్యాయని కార్మికులు ఆరోపించారు. “రోజూ ప్రాణాలను పణంగా పెట్టి పని చేస్తున్నాం, కానీ మాకు భద్రత లేదు” అని ఒక కార్మికుడు ఆవేదన వ్యక్తం చేశాడు.
అదే సమయంలో, సంఘటన స్థలంలో వార్తా ప్రతినిధులు ఫోటోలు తీయగా మిల్లుయాజమాన్యం ‘ఫోటోలు తీయరాదు’ అంటూ ఆంక్షలు విధించిందని సమాచారం. దీంతో, మీడియాపై నియంత్రణ ప్రయత్నాలు, నిజాన్ని దాచిపెట్టే ప్రయత్నంగా భావిస్తున్నారు స్థానికులు.
“ఒక కార్మికుడి గాయం దాచిపెట్టడం ఎవరికీ ప్రయోజనం? భద్రతా లోపాలను సరిదిద్దడమే అసలు బాధ్యత కాదా?” — ఈ ప్రశ్న ఇప్పుడు కాగజ్‌నగర్ వ్యాప్తంగా వినిపిస్తోంది.
ఇది కొత్త ఘటన కాదు. గతంలోనూ ఇలాంటి ప్రమాదాలు చోటుచేసుకున్నా, ప్రతి సారి “విచారణ” పేరుతో విషయం మరుగునపడుతుందని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి.
కార్మికుల ప్రాణాలకంటే ఉత్పత్తి ముఖ్యం అన్న దృక్పథం మారకపోతే, ఇటువంటి దుర్ఘటనలు ఆగవని కార్మికులు హెచ్చరిస్తున్నారు.










