కాగజ్‌నగర్ (కొమరం భీం–ఆసిఫాబాద్ జిల్లా): ఒకప్పుడు తెలంగాణ పరిశ్రమల ప్రతీకగా నిలిచిన సిర్పూర్ పేపర్ మిల్లు…ఇప్పుడు కార్మికుల న్యాయం కోసం పోరాటానికి వేదికగా మారిన దుస్థితి ఆవేదన కలిగిస్తోంది. గుర్తింపు ఎన్నికలు నిర్వహించాలని ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న మిల్లు కార్మికులు, మళ్లీ వీధుల్లో నిరసనకు దిగారు.
యాజమాన్యం మొండి వైఖరి కారణంగా గుర్తింపు ఎన్నికలు నిలుస్తుండటంతో కార్మికులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. హైకోర్టును ఆశ్రయించిన యాజమాన్యం చర్యలతో కార్మికుల ఆశలు మరోసారి నీరసించాయి. హైకోర్టు వివిధ కార్మిక సంఘాలకు నోటీసులు జారీ చేయడంతో మిల్లు పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్తత నెలకొంది.
నవంబర్ 3లోగా కార్మికుల జాబితా పంపిస్తామని ఎన్నికల అధికారి, లేబర్ శాఖ డీసీల్ రాజేశ్వరి ఇచ్చిన హామీతో కాసేపు ఆశలు పుట్టినా… మూడే నెలల్లో యాజమాన్యం వైఖరిలో వచ్చిన మార్పు కార్మికులను నిరాశలో ముంచింది.

ప్రస్తుతం కార్మికులు రూ.15,000 నుండి రూ.17,000 మధ్య వేతనాలతో బతుకుదెరువు నెట్టుకుంటున్నారు. కానీ ఎన్నికల వ్యవహారం కోర్టులోకి వెళ్లడంతో వేతనాల చెల్లింపుల్లో ఆలస్యం అవుతోందని కార్మిక సంఘాలు ఆవేదన వ్యక్తం చేశాయి. తమ హక్కుల కోసం కార్మికులే చందాలు సమకూర్చుకుని కోర్టు వ్యయాలు భరించాల్సి వస్తోందని, న్యాయం కోసం చివరి వరకు పోరాటం కొనసాగుతుందని నాయకులు స్పష్టం చేశారు.
కోర్టు తమకు న్యాయం చేస్తుందన్న నమ్మకం వ్యక్తం చేస్తూనే, ప్రభుత్వం–యాజమాన్యం–లేబర్ శాఖలు ముగ్గురూ నిశ్శబ్దంగా ఉండటం పట్ల కార్మికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలు, హక్కులు, వేతనాలు అన్నీ కోర్టు చుట్టూ తిరుగుతున్న ఈ పరిస్థితిని “కాగజ్‌నగర్ చరిత్రలో మచ్చ”గా అభివర్ణిస్తున్నారు.
తాజాగా బుధవారం వర్కర్స్ గేట్ ఎదుట కార్మిక సంఘాలు భిక్షాటన కార్యక్రమం నిర్వహించాయి. కార్మికుల హక్కుల కోసం ఈ పోరాటం కొనసాగుతుందని నాయకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు ఈర్ల, సతీష్, నగరం గణపతి, శ్యామ్‌రావు, రాజేష్ యాదవ్, రాజమోగాలి, శంకర్‌తో పాటు పలువురు కార్మికులు పాల్గొన్నారు.









