- భక్తుల జోరుతో ఊరేగింపు
- శివనామ ఘోషలలో కిక్కిరిసిన పట్టణం
కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా / కాగజ్ నగర్ : కార్తీకమాసం ముగింపు సందర్భంగా కాగజ్ నగర్ పట్టణంలో సోమవారం భక్తుల రద్దీతో కిక్కిరిసిపోయింది. తెల్లవారుజాము నుంచే శివనామ ఘోషలు మారుమోగుతుండగా, వీధులన్నీ ఇరుముడి ధరించిన భక్తులతో సందడిగా మారాయి. శివ గురు స్వాములు ఈర్ల సతీష్, కత్తుల రాజ్‌కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన శివదీక్ష ఇరుముడి కార్యక్రమం ఆధ్యాత్మికరంగంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించింది. నియమనిష్ఠతో దీక్ష ఆచరించిన భక్తులు, తమ కుటుంబ సభ్యులతో కలిసి కార్యక్రమానికి చేరుకున్నారు. గురుస్వాముల ఆశీర్వాదాలు పొందిన అనంతరం భక్తులు రంగురంగుల ఇరుముడులను అలంకరించి పట్టణంలో ఊరేగింపుగా సాగారు. డోలు, మంగళవాయిద్యాలు, భజన మండళ్ల గానాలు, శివనామ నినాదాలతో పట్టణం ఉత్సవ వాతావరణం సంతరించుకుంది. ఊరేగింపు మార్గమంతా స్థానికులు భక్తులకు పూలదండలు, తలంబ్రాలు అర్పించి స్వాగతం పలికారు. పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరూ పాల్గొనడంతో ఊరేగింపు కుటుంబోత్సవంలా మారింది. భక్తుల భక్తిశ్రద్ధ, నియమనిష్ట చూసిన పట్టణవాసులు అపారమైన భక్తి భావంతో దర్శనం చేసుకున్నారు. అనంతరం భక్తులు ప్రత్యేక వాహనాలతో శ్రీశైలం భ్రమరాంబిక మల్లికార్జున స్వామివారి దర్శనార్థం యాత్రకు బయలుదేరారు. శివనామస్మరణతో, అచంచల విశ్వాసంతో సాగిన ఈ కార్యక్రమం పట్టణంలో ఆధ్యాత్మిక జోష్‌ను మరింతగా పెంచింది.










