contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

కేసీఆర్ ను కలవనున్న మంత్రులు సీతక్క, కొండా సురేఖ

తెలంగాణ రాజకీయాల్లో ఈరోజు ఓ ఆసక్తికర పరిణామం చోటుచేసుకోనుంది. బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను రాష్ట్ర మంత్రులు సీతక్క, కొండా సురేఖ కలవనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు వెళ్లనున్న వీరు, అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన మేడారం సమ్మక్క–సారలమ్మ మహా జాతరకు ఆయనను అధికారికంగా ఆహ్వానించనున్నారు. ఈ సందర్భంగా జాతర ఆహ్వాన పత్రికను కేసీఆర్‌కు అందజేయనున్నారు.

ఇదిలా ఉండగా, తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ధిగాంచిన మేడారం మహా జాతరకు ఏర్పాట్లు జోరుగా కొనసాగుతున్నాయి. ఈ జాతర జనవరి 28 నుంచి 31 వరకు నాలుగు రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. జనవరి 28న సారలమ్మ అమ్మవారు, 29న సమ్మక్క అమ్మవారు గద్దెపైకి విచ్చేయనున్నారు. 30న భక్తులు మొక్కులు చెల్లించుకుని అమ్మవార్ల దర్శనం చేసుకోనుండగా, 31న వనప్రవేశంతో జాతర ముగియనుంది. ఈ మహా పండుగకు లక్షలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉంది.

ప్రజలందరి పండుగగా, రాజకీయాలకు అతీతంగా మేడారం జాతరను నిర్వహించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం అన్ని వర్గాల నేతలను ఆహ్వానిస్తోంది. అందులో భాగంగానే సీతక్క, కొండా సురేఖ కేసీఆర్‌ను స్వయంగా కలసి జాతరకు ఆహ్వానించడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.

భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ప్రభుత్వం భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తోంది. అమ్మవారి గద్దెలు, జాతర ప్రాంగణం పునరుద్ధరణ పనుల ప్రారంభోత్సవం జనవరి 19న జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు పలువురు మంత్రులు హాజరుకానున్నారు.

మొత్తంగా మేడారం జాతర ఏర్పాట్లతో పాటు, కేసీఆర్‌కు ఆహ్వానం నేపథ్యంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తి నెలకొంది.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :