- అధ్యయనానికి త్వరలో కేంద్ర సాంకేతిక కమిటీ పర్యటన
- ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వెల్లడి
కాకినాడ : దేశంలోనే ప్రసిద్ధిగాంచిన ఉప్పాడ చేనేత రంగాన్ని అభివృద్ధి చేసి చేనేత కార్మికుల జీవనోపాధిని మరింత మెరుగుపరిచేందుకు తాము చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నట్లు కాకినాడ ఎంపీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. యు.కొత్తపల్లి మండలంలో ఉప్పాడ తో పాటు అనేక గ్రామాల్లో చేనేత రంగంపై ఆధారపడి జీవిస్తున్న కార్మికులను ఆదుకునేందుకు నేషనల్ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ ప్రోగ్రాం మంజూరు చేసి నిధులు మంజూరు చేయాలని గత కొన్ని నెలలుగా కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నామని తెలిపారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కూడా గతంలో కేంద్రానికి లేఖ రాసిందని గుర్తు చేశారు. ఈ పథకం అమలైతే రూ.15 కోట్లు నిధులు మంజూరు అవుతాయని, ఇందులో కేంద్ర ప్రభుత్వం వాటా 12 కోట్లు కాగా మిగిలిన 3 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందన్నారు. ఈ నిధులతో ఉప్పాడ లో చేనేత రంగాన్ని అంతర్జాతీయ ప్రమాణాలకు దీటుగా అభివృద్ధి చేయడంతో పాటు ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్న సుమారు 700 మంది చేనేత కార్మికులకు ఆర్థిక భరోసా కలుగుతున్నారు. నిధులు మంజూరు కోసం పలుమార్లు కేంద్ర టెక్స్ టైల్స్ శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ ను వ్యక్తిగతంగా కలిసి విజ్ఞప్తి చేయగా సానుకూలంగా స్పందించిన కేంద్రం త్వరలో చెన్నై కేంద్రంగా పనిచేస్తున్న వీవర్స్ సర్వీస్ సెంటర్, జోనల్ డైరెక్టర్ నేతృత్వంలో సాంకేతిక కమిటీని ఉప్పాడలో పర్యటించి నివేదిక అందించాలని ఆదేశాలు జారీ చేసిందన్నారు. త్వరలోనే సాంకేతి కమిటీ ఉప్పాడ తదితర గ్రామాల్లో పర్యటించి వివరాలు సేకరిస్తుందని, కమిటీ నివేదిక ఆధారంగా కేంద్రం నిధులు విడుదల చేస్తుందని అందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తానని ఈ సందర్భంగా ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ తెలిపారు.