కర్నూలు : పనుల్లేక, పంటలకు గిట్టుబాటు ధర రాక… ఈ రెండు కారకాలతో కర్నూలు జిల్లాలోని పల్లె సీమలు వెలితిగా మారుతున్నాయి. ఉపాధి కోసం వలస వెళ్లే కుటుంబాల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. పరిస్థితి ఎంత విషమంగా ఉందంటే, కోసిగి మండలం చింతకుంట గ్రామం నుంచి ఒక్కరోజులోనే 200కు పైగా కుటుంబాలు ఊరును వదిలి వలస వెళ్ళాయని స్థానిక సమాచారం . వీరిలో 25 మంది విద్యార్థులు కూడా ఉండటం బాధాకరం, జిల్లాలోని అనేక గ్రామాలు నేడు ఇదే దయనీయ స్థితిలో ఉన్నాయి..
పత్తి పంట నాశనం – ఆశలూ అడియాశలై
ఈ ఖరీఫ్ సీజన్‌లో జిల్లాలో 5.62 లక్షల ఎకరాల్లో పత్తి సాగు జరిగినా, విపరీతమైన వర్షాలు పంటను నేలమట్టం చేశాయి. కాయలు చెట్లపైనే కుళ్లిపోవడం, మొలకలు రావడం ఆలస్యం కావడంతో రైతులు ఎకరాకు 4-5 క్వింటాళ్ల దిగుబడిని కోల్పోయారు. దీంతో రైతుల పెట్టుబడులు అన్నీ వృథా అయ్యాయి. రోజుకు కూలీ కింద రూ. 300-400 మాత్రమే లభిస్తున్నది. మరోవైపు ఉపాధిహామీ పథకం కింద బకాయిలు ఇంకా విడుదల కాలేదు. పేద ప్రజలు తమ జీవనోపాధి కోసం వలసలు వెళ్తున్నారు.
పొరుగు జిల్లాల్లో ఆశ – రోజుకు రూ. 2,500 దాకా ఆదాయం
తెలంగాణలోని మహబూబ్‌నగర్, వికారాబాద్ మరియు ఏపీ గుంటూరులో పత్తి కోతల పనులకు మంచి కూలీ లభించడంతో వలస తీవ్రత మరింత పెరిగింది. కిలోకు రూ. 15 నుంచి రూ. 18 వరకు కూలీ లభించడంతో, దంపతులిద్దరూ పనిచేస్తే రోజుకు రూ. 1,500, పిల్లలు కూడా తోడైతే రూ. 2,500 వరకు ఆదాయం పొందే అవకాశముంది. మిరప కోతలు మొదలయ్యే వరకు నాలుగైదు నెలల పాటు అక్కడ ఉపాధి లభిస్తుందని వలసకూలీలు చెబుతున్నారు.
ఆస్తి ఉన్నా ఉపాధి లేదు – రైతుల ఆవేదన
చింతకుంటకు చెందిన దంపతుల కథ ఈ విషాద పరిస్థితికి నిదర్శనం. ఆరెకరాల పొలం ఉన్నా, రూ. 4 లక్షల అప్పుతో పత్తి, ఉల్లి పంటలు సాగుచేశారు. కానీ ఉల్లికి ధర రాక పొలంలోనే వదిలేసి, వర్షాలకు పత్తి పంట నాశనమైంది. అప్పులు తీర్చే మార్గం లేక వికారాబాద్‌కు వలస వెళ్తున్నామని వాపోతున్నారు. ఆకలి ముందు చదువులు కూడా పక్కకు తప్పించుకుంటున్నాయి” అని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రాజెక్టులపై ఆశ – నిరీక్షణలో రైతులు
మంత్రాలయం, ఎమ్మిగనూరు, ఆదోని నియోజకవర్గాల నుంచి ఇప్పటివరకు పదివేల కుటుంబాలు వలస వెళ్లినట్టు సమాచారం. నిపుణుల అభిప్రాయం ప్రకారం, వేదవతి, ఆర్డీఎస్, గుండ్రేవుల సాగునీటి ప్రాజెక్టులు పూర్తయితేనే ఈ ప్రాంతానికి శాశ్వత పరిష్కారం కనిపిస్తుంది. ప్రభుత్వానికి దీనిపై చిత్తశుద్ధి ఉంటేనే పల్లె ప్రజల బతుకు మారుతుందని రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు.