కరీంనగర్ జిల్లా: నూతన సంవత్సర వేడుకల సందర్భంగా కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టినట్లు పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం ఐపీఎస్ తెలిపారు. ప్రజల భద్రత దృష్ట్యా డిసెంబర్ 31 రాత్రి ప్రత్యేక ఆంక్షలు అమలులో ఉంటాయని ఆయన స్పష్టం చేశారు.
44 చోట్ల డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు
కమిషనరేట్ వ్యాప్తంగా మొత్తం 44 ప్రాంతాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించనున్నట్లు సీపీ తెలిపారు. ఇందులో మున్సిపల్ పరిధిలోనే 33 చెక్ పాయింట్లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. మద్యం సేవించి వాహనాలు నడిపేవారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు, వాహనాలను వెంటనే సీజ్ చేస్తామని హెచ్చరించారు. ప్రతి తనిఖీ కేంద్రంలో 8 నుంచి 10 మంది పోలీస్ సిబ్బంది, బ్రెత్ అనలైజర్లు, బాడీ వార్న్ కెమెరాలతో విధులు నిర్వహిస్తారని తెలిపారు.
డ్యామ్ కట్ట, తీగల వంతెనపై వేడుకలకు అనుమతి లేదు
డిసెంబర్ 31 రాత్రి లోయర్ మానేరు డ్యామ్ (LMD) కట్ట మరియు తీగల వంతెన (కేబుల్ బ్రిడ్జ్) ప్రాంతాల్లోకి ప్రజలను అనుమతించబోమని స్పష్టం చేశారు. ఈ ప్రాంతాల్లో వేడుకలు నిర్వహించడం పూర్తిగా నిషేధమని, నిరంతర పోలీస్ పెట్రోలింగ్ కొనసాగుతుందని పేర్కొన్నారు.
డీజేలు, బాణాసంచాపై పూర్తి నిషేధం
నూతన సంవత్సర వేడుకల్లో డీజేలు వినియోగించడం పూర్తిగా నిషేధమని తెలిపారు. ధ్వని కాలుష్యానికి సంబంధించి ఫిర్యాదులు అందితే బాధ్యులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ప్రజలు వెంటనే డయల్ 100 కు సమాచారం ఇవ్వాలని సూచించారు.
అలాగే, బహిరంగ ప్రదేశాల్లో బాణాసంచా పేల్చడంపై నిషేధం విధించినట్లు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే సెక్షన్ 188 ఐపీసీ కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
డ్రగ్స్ వాడితే జైలుకే
నగర శివార్లలోని గెస్ట్ హౌస్లు, ఫాంహౌస్లపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. డ్రగ్స్ నియంత్రణ కోసం నార్కోటిక్ టీమ్స్, శిక్షణ పొందిన జాగిలాలు, డ్రగ్ డిటెక్ట్ కిట్లను వినియోగిస్తామని చెప్పారు. డ్రగ్స్ వినియోగం లేదా అక్రమ రవాణా చేసినట్లు తేలితే NDPS చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
మహిళా భద్రతకు ప్రత్యేక చర్యలు
వేడుకల సమయంలో మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. షీ టీమ్స్ నిరంతరం పర్యవేక్షణ చేస్తాయని, ముఖ్య ప్రాంతాల్లో ఫుట్ పెట్రోలింగ్, పికెట్స్ ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు.
సీపీ విజ్ఞప్తి
“నూతన సంవత్సర వేడుకలు ఆనందంగా జరుపుకోవాలి కానీ అవి ఇతరుల ప్రాణాలకు ముప్పుగా మారకూడదు. మద్యం మత్తులో వాహనాలు నడిపి అమాయకుల ప్రాణాలు తీసే పరిస్థితి రావద్దు. పోలీసులకు సహకరించి ప్రశాంతమైన వాతావరణంలో కొత్త సంవత్సరానికి స్వాగతం పలకాలి” అని పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం ఐపీఎస్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.









