contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

భూ సమస్యల పూర్తి పరిష్కారమే లక్ష్యంగా భూ భారతి చట్టం : కలెక్టర్ పమేలా సత్పతి

  • పెండింగ్ లో ఉన్న సాదా బైనమా దరఖాస్తులకు మోక్షం
  • వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ కు భూమి పటాలు
  • 30 రోజులలో భూమి మ్యూటేషన్ దరఖాస్తుల పరిష్కారం
  • భూ భారతి చట్టంలో రెండంచెల అప్పీల్ వ్యవస్థ ఏర్పాటు
  • భూ భారతి చట్టం అవగాహన కార్యక్రమాల్లో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
  • 25 గుంటల భూమికి 50 గుంటలు కట్ చేశారని కలెక్టర్ ముందు రైతు ఆవేదన

 

కరీంనగర్ జిల్లా: భూ సమస్యల పూర్తి పరిష్కారమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం నూతన ఆర్వోఆర్ భూ భారతి చట్టం రూపకల్పన చేసిందని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. భూ భారతితో ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న భూసమస్యలు పరిష్కారం కానున్నాయని అన్నారు.
గురువారం గన్నేరువరం మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర ఫంక్షన్ హాల్లో నిర్వహించిన భూభారతి చట్టం అవగాహన కార్యక్రమాల్లో కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, ఆర్డివో మహేశ్వర్ తో కలిసి పాల్గొన్నారు. భూ భారతి చట్టంలోని వివిధ అంశాలను కలెక్టర్ రైతులకు, ప్రజలకు ఒక్కొక్క సెక్షన్, అంశం వారీగా ద్వారా వివరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భూ సమస్యలు పరిష్కరించడమే లక్ష్యంగా ప్రభుత్వం రూపొందించిన భూ భారతి (రికార్డు ఆఫ్ రైట్స్ ఇన్ ల్యాండ్) చట్టం 2025 అమల్లోకి వచ్చిందని అన్నారు. ముందుగా రాష్ట్రంలోని 4 మండలాలలో పైలెట్ ప్రాజెక్టు కింద ఈ చట్టం అమలు చేస్తున్నారని తెలిపారు.

ఈ చట్టంపై రైతులకు అవగాహన కల్పించేందుకు కరీంనగర్ జిల్లాలో ఏప్రిల్ 17 నుంచి ఏప్రిల్ 30 వరకు ప్రతి మండల కేంద్రంలో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని అన్నారు. భూ భారతి చట్టం ప్రకారం ఏ సమస్యను ఏ అధికారి… ఎన్ని రోజులలో పరిష్కరించాలి…. అది పరిష్కారం కాకుంటే ఎవరికి అప్పీల్ చేయాలనే దానిపై ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు విడుదల చేసిందని తెలిపారు.సీసీఎల్ఏ కు వెళ్లే అవసరం లేకుండా జిల్లా స్థాయిలోనే భూ సమస్యలను పరిష్కరించుకునేందుకు రెవెన్యూ డివిజన్ అధికారికి, కలెక్టర్ కు అధికారాలు కల్పించారని తెలిపారు. భూ సమస్యలు పరిష్కరిస్తూ అధికారులు జారీ చేసిన ఉత్తర్వులపై అభ్యంతరాలు ఉంటే భూ భారతి చట్టం ప్రకారం ఆప్పీల్ చేసుకునే అవకాశం కూడా ఉందని తెలిపారు. రెవెన్యూ డివిజన్ అధికారి నిర్ణయం సరైంది కాదని భావిస్తే కలెక్టర్ వద్ద, కలెక్టర్ నిర్ణయంపై అభ్యంతరం ఉంటే భూమి ట్రిబ్యునల్ వద్ద అపీల్ చేసుకోవచ్చని అన్నారు. గతంలో ధరణి వ్యవస్థ ఉన్నప్పుడు ఏదైనా అభ్యంతరాలు ఉంటే సివిల్ కోర్టుకు మాత్రమే వెళ్లాల్సి ఉండేదని, నేడు ఆ అవసరం లేకుండా అప్పీల్ వ్యవస్థకు అవకాశం కల్పించిందని అన్నారు. గతంలో తహసిల్దార్ స్థాయిలో పరిష్కారం అయ్యే చిన్న సమస్యలు కూడా కలెక్టర్ దగ్గరికి వచ్చేవని అన్నారు. వేల సంఖ్యలో దరఖాస్తులు ఉండడంవల్ల పరిష్కరించడం లో జాప్యం జరిగేదని తెలిపారు. ‘

భూభారతి ద్వారా కిందిస్థాయి అధికారులకు కూడా బాధ్యతలు అప్పగించారని, దీనివల్ల చిన్న సమస్యలు మండల స్థాయిలోనే త్వరితగతిన పరిష్కారం అవుతాయని తెలిపారు. ప్రతి గ్రామంలో రెవెన్యూ రికార్డులు తయారు చేసి, ప్రతి సంవత్సరం గ్రామాలలో రికార్డు డిస్ ప్లే చేయడం జరుగుతుందని అన్నారు. రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రతి గ్రామంలో గ్రామ పరిపాలన అధికారులను నియమించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. మనిషికి ఆధార్ కార్డు లాగా భూమికి భూదార్ సంఖ్య కేటాయింపు ప్రణాళిక చేస్తుందని, దీని ద్వారా భూ ఆక్రమణలకు చెక్ పెట్టవచ్చని అన్నారు. ప్రస్తుతం ధరణి లో ఉన్న భూ రికార్డులు భూ భారతి చట్టంలో కొనసాగుతాయని తెలిపారు. భూ హక్కుల రికార్డుల్లో తప్పుల సవరణకు అర్హులైన వారు జిల్లాలో నూతన చట్టం అమల్లోకి వచ్చిన ఏడాదిలోగా దరఖాస్తు చేసుకోవాలని, ఆ దరఖాస్తులను పరిశీలించి రెవెన్యూ డివిజన్ అధికారి, జిల్లా కలెక్టర్ ఒక నిర్ణయం తీసుకుంటారని అన్నారు. దరఖాస్తుదారునికి ఏమైనా అభ్యంతరాలు ఉంటే కలెక్టర్, భూమి ట్రిబ్యూనల్ లో అప్పీల్ చేసుకోవచ్చని కలెక్టర్ తెలిపారు.భూ భారతి పోర్టల్ లో ఎకరం భూమి మ్యూటేషన్ కోసం 2500 రూపాయల ఫీజు చెల్లించాలని, దరఖాస్తు తో పాటు వారసత్వ ఒప్పంద పత్రం లేదా వీలునామా కాపీ, నిర్దేశించిన తేదీ నుంచి భూమి సర్వే పటం జత చేయాలని, ఈ దరఖాస్తుల పై తహసిల్దార్ 30 రోజుల్లోగా విచారణ చేపట్టి నిర్ణయం తీసుకుంటారని అన్నారు. గడువు తర్వాత ఆటోమేటిక్ గా మ్యూటేషన్ జరుగుతుందని అన్నారు.

పెండింగ్ లో ఉన్న సాధా బైనామా పరిష్కారం కోసం భూ భారతి చట్టంలో ప్రభుత్వం అవకాశం కల్పించిందని అన్నారు. పిఓటి, ఎల్.టి.ఆర్, సీలింగ్ చట్టాల ఉల్లంఘనలు లేని దరఖాస్తులను క్రమబద్ధీకరణ చేసే నాటికి స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు , 100 రూపాయల అపరాధ రుసుం వసూలు చేసి సర్టిఫికెట్ జారీ చేస్తారని అన్నారు. హక్కుల రికార్డులు వివరాలను నమోదు చేసి పాసు బుక్ జారీ చేస్తారని అన్నారు. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ ఒకే రోజు ఉంటాయని అన్నారు. కొనుగోలు, దానం, తనఖా, బదిలీ, భాగం పంపకాల ద్వారా భూమిపై హక్కులు సంక్రమిస్తే తహసిల్దార్ రిజిస్ట్రేషన్ చేసి హక్కుల రికార్డులు మార్పులు చేసి పట్టాదార్ పాస్ పుస్తకం జారీ చేస్తారని తెలిపారు. 300 రూపాయల ఫీజుతో పాస్ బుక్ జారీ చేస్తారని అన్నారు.

భూ భారతి చట్టం పై ఏమైనా సందేహాలు ఉంటే తీర్చడానికి అధికారులు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారని అన్నారు. దరఖాస్తుదారులకు అవసరమైన ఉచిత న్యాయ సలహాను ప్రభుత్వం అందిస్తుందని అన్నారు. చీమలకుంటపల్లి గ్రామానికి చెందిన రైతు సుంకరి నర్సయ్య కు , 805/ఏ,బి లో సర్వే నంబర్లు మూడెకరాల భూమి ఉండగా గతంలో వరద ఉపకాల్వ లో 805/ఏ లో 25 గుంటలు భూమి పోయింది. పోయిన భూమికి పైసలు కూడా వచ్చాయి. కానీ 805/బి లో కూడా 25 గుంటల భూమి కట్ చేశారని దీంతో రైతు భరోస కోల్పోతున్నని ఎమ్మార్వో చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా పని కావడం లేదని కలెక్టర్ ముందు రైతు మోర పెట్టుకున్నాడు. ఎమ్మార్వో కార్యాలయం చుట్టూ తిరిగిన తమ సమస్యలు పరిష్కారం కావడం లేదని పలువురు రైతులు కలెక్టర్ ముందు వాపోయారు. సమస్యను త్వరలో పరిష్కరిస్తామని కలెక్టర్ తెలిపింది. ఈ కార్యక్రమంలో రెవెన్యూ డివిజన్ అధికారి మహేశ్వర్, తహసీల్దార్ ఇప్ప నరేందర్, ఎంపిడివో శ్రీనివాస్, మండల వ్యవసాయ అధికారి కిరణ్మయి, వివిధ గ్రామాల ప్రజలు, రైతులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :