కరీంనగర్ జిల్లా: పట్టణ ప్రజలకు పోలీస్ కమీషనర్ ఒక ముఖ్యమైన విజ్ఞప్తి చేశారు. స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్‌లో భాగంగా కరీంనగర్‌లో ఏర్పాటు చేసిన 769 సీసీటీవీ కెమెరాలు జూన్ 27, 2025 నుండి పూర్తిగా అందుబాటులోకి వచ్చాయని, ఈ కెమెరాల ద్వారా ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలను పర్యవేక్షిస్తామని,తదనుగుణంగా చలాన్లు జారీ చేస్తామని ఆయన స్పష్టం చేశారు.
ఈ చర్యల ప్రధాన లక్ష్యం పౌరుల భద్రతను పెంచడం, రోడ్డు ప్రమాదాలను నివారించడం మరియు నగరంలో ట్రాఫిక్‌ను నియంత్రించడం అని కమిషనర్ పేర్కొన్నారు.
సీసీటీవీ పర్యవేక్షణలో గుర్తించబడే ముఖ్యమైన ట్రాఫిక్ ఉల్లంఘనలు:
● ట్రాఫిక్ సిగ్నల్ జంపింగ్: ట్రాఫిక్ సిగ్నల్ దాటి ముందుకు వెళ్లడం.
● హెల్మెట్ లేకుండా డ్రైవింగ్: ద్విచక్ర వాహనం నడుపుతున్నప్పుడు హెల్మెట్ ధరించకపోవడం.
● సీట్ బెల్ట్ లేకుండా డ్రైవింగ్: కారు నడుపుతున్నప్పుడు సీట్ బెల్ట్ ధరించకపోవడం.
● రాంగ్-సైడ్ డ్రైవింగ్: వ్యతిరేక దిశలో డ్రైవింగ్.
● డ్రైవింగ్ చేస్తున్నప్పుడు సెల్ ఫోన్ ఉపయోగించడం: వాహనం నడుపుతున్నప్పుడు సెల్ ఫోన్ ఉపయోగించడం.
● ట్రిపుల్ రైడింగ్: ఒకే ద్విచక్ర వాహనంపై ముగ్గురు వ్యక్తులు ప్రయాణించడం.
● అతివేగం / ర్యాష్ డ్రైవింగ్: చాలా వేగంగా లేదా ప్రమాదకరమైన వేగంతో వాహనాన్ని నడపడం.
పైన పేర్కొన్న ట్రాఫిక్ నిబంధనలలో దేనినైనా ఉల్లంఘించినందుకు వాహనదారులకు ట్రాఫిక్ చలాన్లు జారీ చేయబడతాయని కమిషనర్ హెచ్చరించారు. అందువల్ల, కరీంనగర్ నగర పౌరులు మరియు వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని మరియు పోలీసులకు సహకరించాలని పోలీస్ కమిషనర్ విజ్ఞప్తి చేశారు.
◆ ఉల్లంఘనల వివరాలు – జూన్ 27 నుండి నేటి వరకు..
మొత్తంగా జూన్ 27వ తేదీ నుండి ఈరోజు (జూలై 17, 2025) వరకు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన 13,869 మందిపై కేసులు నమోదు కాగా, ఈ కేసుల్లో రూ. 1,13,43,400 (ఒక కోటి పదమూడు లక్షల నలభై మూడు వేల నాలుగు వందల రూపాయలు) జరిమానాలు విధించబడ్డాయి.
వీటిలో ముఖ్యంగా:
● ట్రిపుల్ రైడింగ్: 8,808 కేసులు నమోదు కాగా, రూ. 1,05,69,600 (కోటి ఐదు లక్షల అరవై తొమ్మిది వేల ఆరు వందల రూపాయలు) జరిమానా విధించబడింది.
● సీట్ బెల్ట్ ధరించకుండా డ్రైవింగ్: సీసీ కెమెరాల్లో పట్టుబడిన 3,437 మందిపై రూ. 3,43,700 (మూడు లక్షల నలభై మూడు వేల ఏడు వందల రూపాయలు) జరిమానా విధించబడింది.
● సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్: సీసీ కెమెరాల్లో పట్టుబడిన 251 మందిపై రూ. 2,51,000 (రెండు లక్షల యాభై ఒక్క వేల రూపాయలు) జరిమానా విధించబడింది.
● రాంగ్ రూట్ డ్రైవింగ్: సీసీ కెమెరాల్లో పట్టుబడిన 418 మందిపై రూ. 83,600 (ఎనభై మూడు వేల ఆరు వందల రూపాయలు) జరిమానా విధించబడింది.
● హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ (మొదటి రోజు): జరిమానాలు విధించిన మొదటి రోజు 955 మంది పట్టుబడగా రూ. 95,500 (తొంబై ఐదు వేల ఐదు వందల రూపాయలు) జరిమానా విధించినట్లు పోలీస్ కమీషనర్ తెలిపారు.
ప్రస్తుతానికి హెల్మెట్ లేకుండా బైక్ నడపడం, ఓవర్ స్పీడ్ డ్రైవింగ్‌పై జరిమానాలు విధించట్లేదని, ఇతర శాఖల సమన్వయంతో త్వరలో అవి కూడా అమలు చేస్తామని పోలీస్ కమీషనర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో కరీంనగర్ ట్రాఫిక్ ఏసీపీ యాదగిరి స్వామి, ఇన్‌స్పెక్టర్లు ఖరీముల్లా ఖాన్, రమేష్, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.