కరీంనగర్ జిల్లా: పోలీస్ కమీషనర్ గౌష్ ఆలం ఐపీఎస్ బుధవారం కరీంనగర్ మహిళా పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా మహిళా పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ పి. శ్రీలత, కమీషనర్‌కు పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. అనంతరం కమీషనర్ సాయుధ దళ పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు.
తనిఖీలో భాగంగా కమీషనర్ స్టేషన్ సిబ్బందితో మాట్లాడారు. వారికి కేటాయించిన విధులు, రికార్డుల నిర్వహణ, సీసీటీఎన్ఎస్ (CCTNS)లో నమోదైన కేసుల వివరాలను సక్రమంగా పొందుపరచాలని సూచించారు.
అనంతరం, కమీషనర్ మహిళా పోలీస్ స్టేషన్లోని “షీ టీం” కార్యాలయాన్ని సందర్శించి, వారు నిర్వహిస్తున్న విధులను అడిగి తెలుసుకున్నారు. వారి రికార్డులను పరిశీలించారు. భరోసా సెంటర్ సభ్యులతో కూడా మాట్లాడి, ఇటీవల వారు సేవలు అందించిన కేసుల వివరాలను, అలాగే “భూమిక” ద్వారా బాధితులకు అందించే కౌన్సిలింగ్ వివరాలను తెలుసుకున్నారు.
నూతనంగా విధుల్లో చేరిన కానిస్టేబుళ్లకు పోలీస్ స్టేషన్‌లో అన్ని రకాల విధులను నేర్చుకోవాలని, రికార్డు నిర్వహణ, సీసీటీఎన్ఎస్, రిసెప్షన్, కోర్టు డ్యూటీ వంటి విధులను సీనియర్ల ద్వారా తెలుసుకోవాలని సూచించారు. నిజాయితీ, క్రమశిక్షణ, సమయపాలన తప్పనిసరని ఈ సందర్భంగా నూతన కానిస్టేబుళ్లకు కమీషనర్ స్పష్టం చేశారు.
ఈ తనిఖీలో రికార్డుల మెయింటెనెన్స్, పోలీస్ స్టేషన్ పర్యవేక్షణ బాగున్నాయని సంతృప్తి వ్యక్తం చేసిన పోలీస్ కమీషనర్, ఇన్‌స్పెక్టర్ పి. శ్రీలతతో పాటు వారి సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు.
ఈ కార్యక్రమంలో మహిళా పోలీస్ స్టేషన్ ఎస్సైలు డి. మనీషా, సిహెచ్ రాజన్నతో పాటు ఇతర అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.