contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

విద్య,వైద్య రంగాల్లో మౌలిక మార్పులకు శ్రీకారం

కరీంనగర్ జిల్లా: విద్య, వైద్య రంగాల్లో మౌలిక మార్పులకు రాష్ట్రంలోని ప్రజాప్రభుత్వం శ్రీకారం చుట్టిందని మానకొండూర్ శాసనసభ్యుడు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. ఇల్లంతకుంట మండలం రహింఖాన్ పేట గ్రామంలోని తెలంగాణ మోడల్ స్కూల్ లో ఆన్ అకాడమీ ద్వారా ఆన్ లైన్ తరగతులను రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ, ఇప్పటికే రాష్ట్ర ఫ్రభుత్వం విద్య,వైద్య రంగాలకు అత్యధిక ప్రాధాన్యతనిస్తూ మౌలిక వసతుల కల్పనకు పెద్ద ఎత్తున నిధులు వెచ్చిస్తోందని చెప్పారు.అందులో భాగంగానే పాఠశాలల్లో ముఖ్యంగా మోడల్ స్కూళ్లల్లో ఆన్ లైన్ తరగతులపై ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగానే ఆన్ లైన్ తరగతులు ప్రారంభిస్తున్నామన్నారు. ఈ నూతన విధానం ద్వారా విద్యార్థులకు పాఠ్యాంశాలు సులభంగా అర్థం చేసుకోవడమే కాకుండా సందేహాలను నివృత్తి చేసుకునే అవకాశం లభిస్తుందన్నారు. ఒక పాఠాన్ని మళ్లీ వినేందుకు వీలుకలుగుతుందని చెప్పారు. మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతికతను అందిపుచ్చుకుంటూ భవిష్యత్తును నిర్దేశించుకోవాలన్నారు.
సిరిసిల్ల జిల్లాలో పిల్లలకు ఆన్ లైన్ తరగతుల ద్వారా ప్రవేశ పరీక్షలకు ఉచితంగా శిక్షణ అందించేందుకు కలెక్టర్ ప్రత్యేక చోరువ చూపిస్తున్నారంటూ ఎమ్మెల్యే కొనియాడారు. మోడల్ స్కూల్లో విద్యార్థులకు కల్పించిన సౌకర్యాలను పూర్తి స్థాయిలో వినియోగించుకొని విజయవంతం కావాలని ఎమ్మెల్యే విద్యార్థులకు సూచించారు. సెలవు రోజుల్లో విద్యార్థులకు పూర్తిగా ఆటలకే పరిమితం కాకుండా చదువు కోసం కొంత సమయం వెచ్చించాలని ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సూచించారు. గ్రాడ్యుయేషన్ మంచి పై చదువులకు వెళ్లాలంటే ప్రవేశ పరీక్ష రాయాల్సి ఉంటుందని అన్నారు. కష్టపడి చదివే విద్యార్థులు భవిష్యత్తులో బాగుపడతారని, మంచి జీవితాన్ని గడపగలుగుతారన్నారు.
మోడల్ స్కూల్ లో విద్యార్థులకు కలెక్టర్ తో కలిసి ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి విద్యార్థులకు గణితం, తెలుగు, అకౌంటింగ్ ఇంగ్లీష్ పాఠాలను బోధించారు. విద్యార్థులకు పలు ప్రశ్నలు అడిగి వారి నుండి సమాధానాలు రాబట్టారు. అలాగే విద్యార్థుల సందేహాలను నివృత్తి చేశారు.

◆ ఆన్ లైన్ తరగతుల ద్వారా పోటీ పరీక్షలకు సిద్ధం

రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ, పేదలు అధికంగా ఉండే ప్రభుత్వ విద్యా సంస్థల్లోనే పిల్లలకు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేలా ఆన్ లైన్ తరగతుల ద్వారా ఉచితంగా శిక్షణ అందిస్తున్నామన్నారు.
ఆన్ లైన్ తరగతుల్లో దేశంలోని నిపుణులైన ఉపాధ్యాయులచే పిల్లలకు బోధన జరుగుతుందని, ఢీల్లీ లో విద్యార్థులకు అందే శిక్షణ నేడు సాంకేతికతను వినియోగించుకుని సిరిసిల్ల జిల్లాలోని విద్యార్థులకు కూడా అందిస్తున్నామని చెప్పారు. ప్రతి రోజు కనీసం 2 గంటల పాటు ఆన్ లైన్ కోచింగ్ తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. విద్యార్థి జీవితంలో 10,11,12వ తరగతులు అత్యంత కీలకమని. దీనిని సద్వినియోగం చేసుకుంటే జీవితం బాగుంటుందని అన్నారు.
కాలిక్యులస్, ఆర్గానిక్ ఫార్మింగ్, ఎలక్ట్రో మ్యాగ్నెటిసమ్ వంటి ముఖ్యమైన పాఠ్యాంశాలను కాన్సెప్ట్ పక్కాగా నేర్చుకోవాలని కలెక్టర్ చెప్పారు. ఆన్ లైన్ తరగతులలో సందేహాలను నివృత్తి చేసుకునే అవకాశం ఉందని, ప్రతి విద్యార్థి తమ సందేహాలను నివృత్తి చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. విద్యార్థులకు ఏదైనా ఇబ్బందులు ఉంటే వెంటనే అధికారుల దృష్టికి తీసుకుని వస్తే సత్వరమే పరిష్కరిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. ప్రభుత్వం కల్పించిన ఆన్ లైన్ తరగతులు శిక్షణ సౌకర్యం విద్యార్థుల సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు.

◆ కలెక్టర్ కు మంత్రి పొన్నం అభినందన..

ఆన్ అకాడమీ ద్వారా విద్యార్థులకు ఆన్ లైన్ శిక్షణా తరగతులు నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్న రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝాను రాష్ట్ర బీసీ సంక్షేమం, రవాణాశాఖామాత్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ ప్రత్యేకించి అభినందించారు. ఏ జిల్లాలో లేనివిధంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ ఆన్ లైన్ తరగతుల నిర్వహిస్తున్నారని తెలుసుకున్న మంత్రి కలెక్టర్ కు ఫోన్ చేసి అభినందనలు తెలిపారు.

◆ దివ్యాంగురాలికి చేయూత..

దివ్యాంగుల ఆర్థిక పునరావాసం కింద డి.భాగ్యలక్ష్మి అనే మహిళకు ఆర్థిక చేయూతనందించారు. ఇల్లంతకుంట మండల కేంద్రంలో బ్యాంగిల్, కంగన్ హాల్ పెట్టుకోవడం కోసం రూపాయలు 50,000 రూపాయల రుణం మంజూరు కాగా, ఆ చెక్కును భాగ్యలక్ష్మికి అందించారు.ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారి వినోద్ కుమార్, జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం, ఇల్లంతకుంట తహసీల్ధార్ ఎంఏ ఫారుఖ్, మండల అభివృద్ధి అధికారి వై.శశికళ, స్థానిక నాయకులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఇల్లంతకుంట మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి భాస్కర్ రెడ్డి, మండల పరిషత్ మాజీ అధ్యక్షులు ఊట్కూరి వెంకటరమణారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ ఐరెడ్డి చైతన్య మహేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ ఎనగందుల ప్రసాద్, పార్టీ నాయకులు పసుల వెంకటి, పాశం రాజేందర్ రెడ్డి, ఆకుల సత్యం, సురేందర్ రెడ్డి, బత్తిని నారాయణ తోపాటు కళాశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :