కరీంనగర్ జిల్లా: గన్నేరువరం మండలం చీమలకుంటపల్లి గ్రామానికి చెందిన మమ్ముత్ ఫౌజియా (25) కుటుంబ సమస్యల కారణంగా, కరీంనగర్ లోయర్ మానేరు డ్యామ్ లో ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించగా, విధులు నిర్వహిస్తున్న హోంగార్డు ఆమెను రక్షించారు.
లేక్ ఔట్ పోస్ట్ లో విధులు నిర్వహిస్తున్న హోంగార్డు ఎం.ఎ. హఫీజ్ బేగ్ వెంటనే అప్రమత్తమయ్యారు. ఆత్మహత్యాయత్నం చేయబోతున్న ఆమెను గుర్తించి, వెంటనే ఆమె దగ్గరికి వెళ్లి సముదాయించి, ఆ ప్రయత్నం నుంచి విరమింపజేశారు.
అనంతరం ఆమెను సురక్షితంగా లేక్ పోలీస్ ఔట్ పోస్ట్ కు తరలించి, ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కుటుంబ సభ్యులు చేరుకున్న తర్వాత, వారికి కౌన్సిలింగ్ ఇచ్చి, భవిష్యత్తులో ఇలాంటి నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఆపదలో ఉన్న మహిళను కాపాడిన హోంగార్డుల ధైర్యసాహసాలను ఉన్నతాధికారులు అభినందించారు.