కరీంనగర్ జిల్లా: వీణవంక మండలం చల్లూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని, అంగన్వాడీ కేంద్రాన్ని అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే మంగళవారం తనిఖీ చేశారు. అంగన్వాడీ కేంద్రంలో పిల్లల హాజరు నమోదు పరిశీలించారు. బరువు తక్కువ ఉన్న పిల్లల వివరాలను అడిగి తెలుసుకున్నారు. వారికి అదనపు రేషన్ ఇవ్వాలని సూచించారు. పిల్లలు ఎవరైనా అతిగా బరువు తక్కువగా ఉంటే వారిని గుర్తించి కరీంనగర్ ఎన్ఆర్సి కేంద్రానికి రిఫర్ చేయాలని తెలిపారు. అంగన్వాడీలో ఇచ్చే డైట్ మెనూ అందరికీ కనబడే విధంగా ప్రదర్శించాలని ఆదేశించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన అడిషనల్ కలెక్టర్ మందుల నిల్వలను, రిజిస్టర్ లను తనిఖీ చేశారు. ఓపి, ఐపి రిజిస్ట్రేషన్ లను పరిశీలించారు. అక్కడ ఉన్న రోగులతో మాట్లాడి అందుతున్న వైద్య సేవలను గురించి అడిగి తెలుసుకున్నారు. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే మెడికల్ క్యాంపులు నిర్వహించాలని వైద్యాధికారులను ఆదేశించారు.
