● గన్నేరువరం మండలంలో 70 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంచిన ఎమ్మెల్యే కవ్వంపల్లి
కరీంనగర్ జిల్లా: రైతులకు అవసరమైనంత మేరకు యూరియా బస్తాలను అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కపంపల్లి సత్యనారాయణ అన్నారు. గన్నేరువరం మండల కేంద్రంలోని రైతు వేదికలో మండలానికి చెందిన 70 మంది సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులకు 18 లక్షల 73 వేల రూపాయల విలువగల చెక్కులను శుక్రవారం ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలో యూరియాకు కొరత లేదని, అయినప్పటికీ బీఆర్ఎస్ నాయకులు యూరియా కొరత ఉందంటూ దుష్ప్రచారం సాగిస్తున్నారని విమర్శించారు. ఆ పార్టీకి చెందిన వారే ఎరువుల దుకాణాల యజమానులను బెదిరింపులకు గురిచేస్తూu ఒక్కొక్కరు 30 /40 బస్తాలు చొప్పున తీసుకెళ్లి కృత్రిమ కొరత సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ వాళ్లు చెబుతున్నట్టుగా యూరియా కొరత లేదని, ఈ విషయంలో రైతులెవరు ఆందోళన చెందావద్దన్నారు. రైతులకు అవసరమైన ఎరువులను అందజేస్తామని ఆయన తెలిపారు.
నిరుపేదల వైద్యం ఖర్చులకు సీఎంఆర్‌ఎఫ్ పథకం ఆర్థికంగా అండగా నిలుస్తున్నదని ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. పేదల వైద్యానికి సీఎంఆర్‌ఎఫ్ పథకం భరోసా కల్పిస్తూ వారిని ఆదుకుంటుందని అన్నారు. నిరుపేదలందరికీ సంక్షేమ ఫలాలు అందించడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని ఆయన చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే పేదల ప్రభుత్వమని ఆయన గుర్తు చేశారు.ప్రజల ఆశలు ఆకాంక్షలకు అనుగుణంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం పనిచేస్తున్నదని ఎమ్మెల్యే కవ్వంపల్లి చెప్పారు.
ఈ కార్యక్రమంలో మండల అభివృద్ధి అధికారి శ్రీనివాస్, మండల వ్యవసాయ అధికారి కిరణ్మయి, గన్నేరువరం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముస్కు ఉపేందర్ రెడ్డి, పార్టీ నాయకులు అల్లూరి శ్రీనాథ్ రెడ్డి, కొమ్మెర రవీందర్ రెడ్డి,బుర్ర శ్రీధర్ గౌడ్, మాతంగి అనిల్, బొడ్డు సునిల్, దొడ్డు మల్లేశం, కొండాపూర్ శ్రీనివాస్, నర్సింహారెడ్డి,బుర్ర తిరుపతి గౌడ్, సంపత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.