● సమీక్ష సమావేశంలో అధికారులకు ఎమ్మెల్యే కవ్వంపల్లి ఆదేశం
కరీంనగర్ జిల్లా: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయడానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలని మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఎల్ఎండీ కాలనీలోని ప్రజాభవన్ లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పనుల పురోగతిపై నియోజకవర్గంలోని ఆరు మండలాలకు చెందిన ఎంపీడీవోలు,హౌసింగ్ అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మండలాల వారీగా ఇందిరమ్మ ఇంటి పథకం అమలు, ఇళ్ల నిర్మాణాల ప్రగతి వివరాలను తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ నియోజకవర్గం లో ఇందిమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని, ఇందుకోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. లబ్ధిదారులంతా వెంటనే ఇళ్ల నిర్మాణాలు చేపట్టేలా చూడాలన్నారు. ఇప్పటి వరకు నిర్మాణాలు చేపట్టి వారి ఇళ్లను రద్దు చేసి ఇతరులకు ఇవ్వాలన్నారు. గృహనిర్మాణ సంస్థ అధికారులు, ఎంపీడీవోలు సమన్వయంతో ఇళ్ల నిర్మాణాల ప్రగతిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ లబ్ధిదారులకు తగు సూచనలు చేయాలన్నారు. బిల్లుల చెల్లింపుల్లో ఆలస్యం జరగకుండా చూసుకోవాలని అధికారులను ఎమ్మెల్యే కోరారు. ఈ సమావేశంలో తహసీల్దార్లు వీవీ వరలక్ష్మి (మానకొండూర్), జి.కృష్ణప్రసాద్ (శంకరపట్నం), వి.సురేందర్ (తిమ్మాపూర్), డి.శ్రీనివాస్ (గన్నేరువరం), కె.ప్రవీణ్ ( బెజ్జంకి), వై.శశికళ ( ఇల్లంతకుంట)తోపాటు ఆయా మండలాల హౌసింగ్ ఏఈలు, అధికారులు పాల్గొన్నారు.