కరీంనగర్ జిల్లా: కరీంనగర్ కేంద్రం కార్ఖానగడ్డలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల (సైన్స్ వింగ్) లోని నూతన భవనంలో సౌకర్యాలు కల్పించి తరగతులు ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. మంగళవారం ఈ కళాశాలను కలెక్టర్ సందర్శించారు. ఇక్కడ జరుగుతున్న మౌలిక సదుపాయాలు, మరమ్మతు పనులను పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. ముందుగా కళాశాల ప్రాంగణంలో ఉన్న స్క్రాప్ తొలగించాలని ఆదేశించారు. శిధిలావస్థలో ఉన్న భవనాలకు ఎటువంటి మరమ్మతులూ చేపట్టరాదని, వాటన్నింటినీ పూర్తిగా తొలగించాలని అన్నారు.కళాశాలలో మౌలిక సదుపాయాల కోసం ప్రభుత్వం మంజూరు చేసిన రూ.15 లక్షలు విద్యార్థులకు టాయిలెట్స్, శుద్ధి చేసిన తాగునీరు అందించేందుకు, తరగతి గదుల్లో అత్యవసర మరమ్మతుల కోసం వినియోగించాలని అన్నారు. ఈ కళాశాలలో ఆరు తరగతులతో కూడిన నూతన భవన నిర్మాణం నాలుగేళ్ల క్రితం ఆగిపోయినందున ఈ భవనాన్ని వినియోగంలోకి తీసుకురావాలని సూచించారు. తరగతులు ప్రారంభించేందుకు అవసరమైన డోర్లు, కిటికీలు, బ్లాక్ బోర్డ్స్, ఫర్నిచర్, బెంచీలు తదితర అవసరాలు వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. నూతన భవనంలో తరగతులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. కలెక్టర్ వెంట ప్రిన్సిపాల్ వెంకటరమణచారి తదితరులు పాల్గొన్నారు.
