కరీంనగర్ జిల్లా: కరీంనగర్ పోలీస్ కమిషనరేట్‌కు కొత్త లోగోను ప్రతిపాదిస్తూ, ఈ లోగో మార్పునకు రాష్ట్ర డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు. నూతన లోగో రూపకల్పనను పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం ప్రతిపాదించారు. కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ భద్రత, శాంతిభద్రతల సంరక్షణలో నిబద్ధతను సూచించేలా ఈ లోగోను రూపొందించారు. ఈ లోగోలో WHO DARES, WINS అనే పదం ఉంటుంది, ఇది ధైర్యం చేసేవాడు గెలుస్తాడు అని తెలుపుతుంది. లోగోలో కనిపించే అశోక చక్రం మరియు నాలుగు సింహాల చిహ్నం దేశభక్తిని, శక్తిని, ప్రజల పట్ల నిబద్ధతను ప్రతిబింబిస్తాయి.
నూతన లోగో గురించి పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం మాట్లాడుతూ, “కొత్త లోగో కమిషనరేట్ పోలీసులలో ఒక కొత్త స్ఫూర్తిని, ప్రజల పట్ల మరింత జవాబుదారీతనాన్ని తీసుకువస్తుంది. ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణకు మేము ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటాం” అని పేర్కొన్నారు. రాష్ట్ర డీజీపీ జితేందర్ ఈ నూతన లోగో ప్రతిపాదనకు ఆమోదం తెలిపి, ఉత్తర్వులు జారీ చేయడంతో ఇది అధికారికంగా అమల్లోకి వచ్చింది.
ఈ కొత్త లోగో కరీంనగర్ పోలీస్ కమిషనరేట్‌లోని అన్ని యూనిఫాంలు, వాహనాలు, అధికారిక పత్రాలపై ఉపయోగించబడుతుందని పోలీస్ కమీషనర్ తెలిపారు.